కొవిడ్‌ వైరల్ లోడ్‌ను తగ్గించే ‘చూయింగ్ గమ్’

by  |
కొవిడ్‌ వైరల్ లోడ్‌ను తగ్గించే ‘చూయింగ్ గమ్’
X

దిశ, ఫీచర్స్: SARS-CoV-2 వైరస్‌కు ‘ట్రాప్’‌గా ఉపయోగపడే ‘ప్లాంట్ గ్రోన్ ప్రోటీన్‌’తో కూడిన చూయింగ్ గమ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇది లాలాజలంలో వైరల్ లోడ్‌ను తగ్గిస్తుంది. రెండు డోసుల టీకాలు తీసుకున్న వ్యక్తులు కూడా SARS-CoV-2 బారిన పడతారని, టీకాలు పొందని వారిలో మాదిరిగానే వైరల్ లోడ్‌ అధికంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. దీనికి సంబంధించిన పరిశోధన విశేషాలు మాలిక్యులర్ థెరపీ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.

SARS-CoV-2 లాలాజల గ్రంథుల్లో ఉంటుందని తెలిసిన విషయమే. వ్యాధి సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా లేదా మాట్లాడినప్పుడు లాలాజలంలోని వైరస్‌లో కొంత భాగం గాల్లో ప్రయాణించి ఇతరులకు సోకుతుంది. అందువల్ల లాలాజలంలోని వైరస్‌ను నిరోధించేందుకు, వ్యాధి వ్యాప్తికి మూలాన్ని తగ్గించేందుకు సులభమైన మార్గంగా ‘చూయింగ్ గమ్’‌ను అభివృద్ధి చేశారు.

‘మహమ్మారికి ముందు, హైపర్‌టెన్షన్‌కు చికిత్స చేసేందుకు యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ 2 (ACE2) ప్రోటీన్‌ను అధ్యయనం చేశాను. ఈ క్రమంలో మొక్కల ఆధారిత ఉత్పత్తి వ్యవస్థను ఉపయోగించి ఏస్-2 ప్రొటీన్‌ను రూపొందించాను. ఇది బీపీకి మాత్రమే కాకుండా అనేక ఇతర చికిత్సలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉందని గ్రహించాను. అదే విధంగా SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్‌ను ACE2 రిసెప్టర్ అడ్డుకుంటున్నట్లు పరిశోధనలో తేలింది. అంతేకాదు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌లతో బాధపడుతున్న వ్యక్తుల్లో ACE2 ఇంజెక్షన్లు వైరల్ లోడ్‌ను తగ్గించగలవని గత పరిశోధనల్లోనూ తేలింది. ఈ క్రమంలోనే సహోద్యోగి హ్యూన్ కూతో కలిసి ఏస్ ప్రోటీన్‌ కలిగిన చూయింగ్ గమ్ రూపొందించాం.

చూయింగ్ గమ్‌ను పరీక్షించేందుకు మా బృందం మొక్కల్లో ACE2ని పెంచి, దాన్ని గమ్ టాబ్లెట్స్‌లో చేర్చాం. కొవిడ్-పాజిటివ్ రోగుల నుంచి నాసోఫారింజియల్ స్వాబ్‌ నమూనాలు సేకరించి ప్రయోగాలు చేశాం. స్పైక్ ప్రోటీన్‌ను నేరుగా బంధించడం ద్వారా గమ్ వైరస్‌ లేదా వైరల్ కణాలను మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందని మేం గమనించాం. చివరగా మా బృందం COVID-19 రోగుల నుంచి లాలాజల నమూనాలను ACE2 గమ్‌తో పరీక్షించి చూడగా.. వైరల్ RNA స్థాయి దాదాపుగా గుర్తించలేని విధంగా తగ్గిపోయాయ’ని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం సైంటిస్ట్ హెన్రీ డేనియల్ తెలిపారు.

ప్రస్తుతం SARS-CoV-2 సోకిన వ్యక్తులపై పరీక్షించినప్పుడు అది ప్రభావవంతంగా పనిచేస్తుందో లేదో అంచనా వేసేందుకు క్లీనికల్ ట్రయల్ నిర్వహించడానికి అనుమతిని పొందే దిశగా హెన్రీ డేనియల్ బృందం పని చేస్తోంది. గమ్ సురక్షితంగా, ప్రభావవంతంగా ఉందని క్లీనికల్ ట్రయల్స్ రుజువు చేస్తే, వైరస్ సంక్రమించే సంభావ్యతను తగ్గించేందుకు, ఇన్ఫెక్షన్ స్థితి తెలియని రోగులకు ఇవ్వవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed