ఆన్‌లైన్ క్లాసుల్లో యూనిఫాం ధరించాలని ఒత్తిడి

by  |
ఆన్‌లైన్ క్లాసుల్లో యూనిఫాం ధరించాలని ఒత్తిడి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా తీవ్రతతో జనజీవనం అతలాకుతలమవుతోంది. అకాడమిక్ ఇయర్‌ను ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినా రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. ఇంటి వద్ద ఉంటూనే క్లాసులు వింటున్నా.. యూనిఫాం ధరించే క్లాసులకే హాజరుకావాలనే నిబంధనను తప్పనిసరి చేస్తున్నాయి. యూనిఫాంలను తమ పాఠశాలలోనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు మొబైల్ ఫోన్లలో సమాచారం ఇస్తున్నారు. కరోనాతో ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే ట్యూషన్, యూనిఫాం ఫీజుల వసూలులోనూ పాఠశాలలు నిబంధనలు పాటించడం లేదు.

లాక్‌డౌన్ రోజుల్లో ట్యూషన్ ఫీజులను ఒకేసారి వసూలు చేయొద్దని, నెల చొప్పున తీసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రైవేటు పాఠశాలలు పట్టించుకోవడం లేదు. టర్మ్ ఫీజులను 2 లేదా 3 విడతల్లో చెల్లించాలని తల్లిదండ్రులకు పదేపదే సూచిస్తున్నారు. కేవలం ఆన్‌లైన్ పాఠాలు వినడానికి స్కూల్ యునిఫాంలో కూర్చోవాలని ఒత్తిడి తెస్తుండటంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిటీలోని పలు ప్రైవేటు పాఠశాలలు ఫీజులను చెల్లించాలని లాక్‌డౌన్ రోజుల్లో తల్లిదండ్రులను కోరడంపై నిరసనలు, ఫిర్యాదులు అందడంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. తాజాగా విద్యార్థులకు యూనిఫాం కొనుగోలు చేయాలని, తమ పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని సైనిక్‌పురిలోని భవాన్స్ రామకృష్ణ విద్యాలయం తల్లిదండ్రులకు మొబైల్ మెసేజ్ పంపించాయి. ఈ విషయాన్ని మేడ్చల్ డీఈవో దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుత గడ్డుకాలంలో తల్లిదండ్రులను వేధిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడంతో పాటు ఫీజుల వసూలు కోసం ఒత్తిడి తేవడం సరికాదని సంఘం సూచించింది. స్కూళ్లలో పాఠాలు బోధించే పరిస్థితి ప్రస్తుతం లేకపోయినా ప్రైవేటు పాఠశాలలు అవకాశమున్న అన్ని అంశాలను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే సాధారణ రోజుల్లో మాదిరిగా ఫీజులు వసూలు చేయడంపైనే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తమ వ్యతిరేకతను తెలుపుతున్నారు.

Next Story

Most Viewed