విన్నర్ మీర్జాపూర్ 2 కాదు!

by  |
విన్నర్ మీర్జాపూర్ 2 కాదు!
X

దిశ, వెబ్‌డెస్క్: మీర్జాపూర్ సిరీస్‌కు సంబంధించి సీజన్ 2 ప్రైమ్ వీడియోలో విడుదలైంది. దీని విడుదల కోసం అభిమానులు రెండేళ్ల పాటు ఎదురుచూశారు. చివరకు విడుదలయ్యాక ఆశించినంత గొప్పగా లేకపోవడంతో పెదవి విరిచారు. అయితే, ఈ పెదవి విరుపును తన విజయానికి వాడుకొని ఇటీవల విడుదలైన మరో సిరీస్ దూసుకెళ్తోంది. అదే ‘స్కామ్ 1992’. మీర్జాపూర్ 2 కంటే 14 రోజుల ముందే అంటే అక్టోబర్ 9న సోనీ లివ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో విడుదలైన ఈ సిరీస్‌ను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. అందరూ మీర్జాపూర్ మోడ్‌లో మునిగితేలారు. కానీ, ఇప్పుడు ఎగబడి చూస్తున్నారు. మీర్జాపూర్ 2 మిగిల్చిన నిరాశను స్కామ్ 1992 పూడుస్తోంది. అంటే ఇప్పుడు క్లియర్‌కట్‌గా విన్నర్ మీర్జాపూర్ 2 కాదని నిరూపితమైంది. ఇంతకీ ఈ సిరీస్ కథాంశం ఏంటి?

ఓటీటీలు రాకముందు నుంచి కూడా బయోపిక్‌లకు ఉన్న ఆదరణ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక ఓటీటీలు వచ్చాక సినిమా కథల కోసం నిజజీవిత కథలను చిత్రీకరించడం చాలా కామన్‌గా మారింది. అలాంటి ఒక నిజజీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ఇది. ప్రముఖ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా 1992లో చేసిన భారతీయ స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. జర్నలిస్ట్ సుచేతా దలాల్ ఇన్‌పుట్స్, దేబాషిష్ బసు రాసిన ‘ద స్కామ్: హూ వాన్, హూ లాస్ట్, హూ గాట్ అవే’ పుస్తకం ఆధారంగా దీని స్క్రిప్ట్ తయారు చేసుకుని హన్సల్ మెహతా దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రతీక్ గాంధీ, షరీబ్ హష్మి, శ్రేయా ధన్వంతరి ప్రధాన పాత్రలు పోషించారు. మొత్తం పది ఎపిసోడ్‌లుగా విడుదలైన ఈ సిరీస్ ఇప్పుడు విమర్శకుల మన్ననలు పొందుతుంది. ఈ సిరీస్‌ను రివ్యూ చదివి, చూడటం కంటే నేరుగా చూస్తే అసలైన మజా వస్తుంది. దలాల్ స్ట్రీట్‌లో జరిగే దందా, ఒక వ్యక్తి తన తెలివితేటలతో ఎలా స్కామ్ చేయగలిగాడు వంటి సన్నివేశాలను అద్భుతంగా ప్రజెంట్ చేశారు.


Next Story