దిగుమతి సుంకంపై సందేహాలతో శాంసంగ్ ఆఫీసుల్లో తనిఖీలు

by  |
దిగుమతి సుంకంపై సందేహాలతో శాంసంగ్ ఆఫీసుల్లో తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: నెట్‌వర్క్ పరికరాల దిగుమతి సుంకం ఎగవేతపై సందేహాలున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీ శాంసంగ్ కార్యాలయాల్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబైల్లో ఉన్న కంపెనీ ఆఫీసుల్లో ఈ తనిఖీలను జరిపారు. నెట్‌వర్క్ కార్యకలాపాలు నిర్వహించే ముంబై కార్యాలయంలో మొదట ఈ ప్రక్రియ జరిగిందని, అనంతరం గురుగ్రాంలోని స్థానిక కార్యాలయంలో తనిఖీ జరిపినట్టు తెలుస్తోంది. అయితే, ఈ తనిఖీలకు సంబంధించిన అంశాలపై డీఆర్ఐ అధికారులు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

దిగుమతులకు సంబంధించి పత్రాల పరిశీలన వంటి ప్రక్రియ జరిగి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శాంసంగ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు 4జీ పరికరాలను సరఫరా చేస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉన్న నేపథ్యంలో శాంసంగ్ కంపెనీ తన సొంత దేశం వియత్నాం, దక్షిణ కొరియాల నుంచి టెలికాం పరికరాలను ఎలాంటి పన్నులు చెల్లించకుండా దిగుమతి చేసుకుంటోంది. అయితే, భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని దేశాల్లో తయారైన నెట్‌వర్క్ పరికరాలను వియత్నాం, దక్షిణ కొరియా దేశాల మార్గంలో దిగుమతి చేసుకుంటున్నట్టు సమాచారం ఉంది. ఇలాంటి మార్గాల్లో దిగుమతి చేసుకుంటే దిగుమతి సుంకం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.



Next Story