నేటి నుంచి రైతుబంధు పంపిణీ

by  |
నేటి నుంచి రైతుబంధు పంపిణీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజన్‌కు రైతుబంధు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జనవరి ఏడు వరకు రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు సాయం అందుతుందన్నారు. ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున రూ.7,515 కోట్ల రూపాయలు ఇందుకోసం విడుదల చేశామన్నారు. ప్రతి రైతుకూ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల ఏడున నిర్వహించిన సమీక్షలో 27 నుంచే రైతుబంధు పంపిణీ మొదలవుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారం సోమవారం నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. రైతులందరికీ పంటసాయం అందేలా వ్యవసాయ శాఖ, రైతుబంధు సమన్వయ సమితి చొరవ తీసుకోనున్నాయి. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుకు ప్రాధాన్యం ఇస్తారు. పది రోజులలో అర్హులైన లబ్ధిదారులందరికీ అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రెండు వారాల తర్వాత ప్రగతిభవన్‌కు

ఈ నెల ఏడున రైతుబంధు పంపిణీపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ పదిన మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పదమూడున తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకుని తిరిగి సమీక్ష నిర్వహించారు. 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి వీలైనంత తొందరగా నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, పోలీసులతోపాటు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పిచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. ఏయే శాఖలో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో గుర్తించి ఆ ప్రకారం నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఆ తరుఆత 13వ తేదీ సాయంత్రమే ప్రగతిభవన్‌ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. 14 రోజుల తర్వాత ఆదివారం సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు టెక్నికల్ టీచర్లు, సిబ్బంది ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. కరోనా సాకుతో వేతనాలు ఇవ్వడంలేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.


Next Story

Most Viewed