అమ్మకమే ఆర్టీసీ ‘వజ్ర’ సంకల్పమా!?

by  |
అమ్మకమే ఆర్టీసీ ‘వజ్ర’ సంకల్పమా!?
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆ నాజూకైన బస్సు పేరు ‘వజ్ర’. చిన్నగా, సన్నగా స్టైల్ ఉట్టిపడుతుంది. సాధారణంగా ఉండే 50 సీట్లకు బదులు 21 లగ్జరీ సీట్లతోనే ముస్తాబైనది. కాలనీ తొవ్వల్లో ఈజీగా దూరేస్తుంది. పైకి ఎంత స్మార్టుగా ఉంటుందో, లోపల అంతకు మించి అట్రాక్ట్ చేస్తుంది. ఎల్‌ఈడీ టీవీ, ఏసీ, సీసీ కెమెరా వంటివి దాని హంగులు. రక్షణ సహిత సుఖమయ జర్నీ. ప్యాసింజర్, స్టాఫ్ అంతా టెక్నాలజీ‌తోనే టచ్‌లో ఉండేది! అంటే, ఫిజికల్‌గా టికెట్ ఉండదు. ప్రయాణానికి కనీసం అరగంట ముందు యాప్‌లో బుక్ చేసుకోవాలి అంతే. నో కండక్టర్. ఓన్లీ డ్రైవర్. ఓవరాల్‌గా దేశంలోని మరే ఆర్టీసీలో లేనంతటి వైవిధ్యంగా మన టీఎస్‌ఆర్టీసీ వాటిని డిజైన్ చేయించింది. ప్రయాణికుల సంతృప్తినే లక్ష్యంగా నిర్దేశించుకున్నది. వాటి ఆదరణపై అంతలా హోప్స్ పెట్టుకొన్నది. అందుకే వజ్ర అని ఆ చిట్టిపొట్టి సర్వీసులకు నామకరణం చేసింది. అంతేనా! ‘ప్రయాణానికి పునర్నిర్వచనం’ ట్యాగ్ రాయించింది. అంత గొప్పగా రూపుదిద్దామని భావించింది. ప్రగతి భవన్‌లో స్వయంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2017 మే 4న ప్రారంభింపజేసింది. మొబైల్/ట్యాబ్ యాప్, వజ్ర బుక్‌లెట్‌లను సీఎం లాంఛనంగా ఆవిష్కరించి, బస్సును పరిశీలించారు. వజ్ర బస్సులు దేశంలోనే వినూత్నమైనవిగా నిలువాలనీ ఆ సందర్భంలో ఆయన ఆకాంక్షించారు. సిటీ నుంచి నిజామాబాద్, వరంగల్‌ల‌తో పాటు మరిన్ని నగరాలకు విస్తరించాలని సూచించారు. సీన్ కట్ చేస్తే..

వజ్ర వైభవం వెలవెల..!

మూడేండ్లు తిరక్కుండానే, వజ్ర బస్సుల వైభవం తలకిందులవుతున్నది! నష్టాలతో వెలవెలబోతున్నట్టు తెలుస్తున్నది. ఎంతో మధనం చేశాకే ఆ మినీ బస్సులను ప్రవేశపెట్టారు. మొత్తానికి 100 బస్సులను సమకూర్చుకున్నారు. ఒక్కోదానికి సుమారు రూ.25 లక్షలు వెచ్చించారు. ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన వజ్ర బస్సుల్లో లోటుపాట్లపైనా జాగ్రత్త పడ్డారు. మొదట్లో కేవలం యాప్ బుకింగ్‌కే పరిమితం చేయగా, తర్వాత బుకింగ్‌తో నిమిత్తం లేకుండా నేరుగా బస్సెక్కినా అనుమతించారు. అయితే, మొబైల్ ఫోన్ నెంబరు కంపల్సరీ. ఎందుకంటే, టికెట్ మెసేజ్ సెల్‌ఫోన్‌కే వస్తుంది. నిజానికి ప్రజల ఆవాసాలకు దగ్గర చేయాలన్నది ఓ ముఖ్య ఉద్దేశం. అంటే, ఎంజీబీఎస్ వంటి బస్ స్టేషన్లకు వెళ్లక్కర్లేకుండానే, వజ్రను ప్రయాణికుల ముందుకు పంపేవారు. ఎల్‌బీ‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ వంటి చోట్ల నుంచి మొదట్లో వరంగల్, నిజామాబాద్‌లకు వాటిని వేశారు. ఆ సిటీల్లోనూ కాలనీలదాకా చేరేలా చూశారు. పికప్, డ్రాప్‌లను ఫాలో అయ్యారు. ఒకే రేటు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో ఆయా పాయింట్లలో ఆ మినీ బస్సు ఎక్కడ ఎక్కినా, వరంగల్‌కు రూ.300లే! అక్కడ్నించి ఇటు సేమ్. తదనంతరం కరీంనగర్, గోదావరిఖనిలకూ వజ్రను విస్తరించారు. ఎంత తండ్లాడినా, నిర్వహణలో ఇబ్బందులు, నిరాదరణ, నష్టాలు వజ్ర బస్సులను వెంటాడాయని వినవస్తోంది.

గత్యంతరం లేక.. గట్టెక్కించలేక..!

ఆర్టీసీలో నిరుడు సుదీర్ఘ సమ్మె కాలంలోనూ, అనంతరమూ వజ్ర బస్సులు రోడ్డెక్కడం తగ్గింది. వాటికి దాదాపు రూ.25 కోట్లు వ్యయమయ్యాయి. ఇప్పటికే కనీసం రూ.10 కోట్లు లాస్ అయినట్టు తెలుస్తున్నది. గత్యంతరం లేక, వాటిని గట్టెక్కించలేక..వదిలించుకోవడమే మార్గమని యోచిస్తున్నారట. దీనిపై గత నెల నుంచి మరింత శ్రద్ధ పెడుతున్నారు. ఏదైనా సంస్థకు విక్రయించాలనీ, ఒక్కో బస్సుపై రూ.10 లక్షలపైన తక్కువైనా ఇచ్చేయాలని తలపోస్తున్నారని సమాచారం. ఆ విధంగా సగానికిపైగా బస్సుల అమ్మకంపై ‘వజ్ర’ సంకల్పానికే వస్తున్నారట! ఎంతో ప్రిస్టేజీగా ఉనికిలోకి తెచ్చిన వజ్ర బస్సుల కొనసాగింపునకు ప్రభుత్వం ఏమైనా తరుణోపాయం చూపుతుందా? లేక ఎట్లాగూ తుట్టే దక్కింది కాబట్టి, విక్రయించడమే మేలని డిసైడ్ చేస్తారా? చూడాలి!

Tags: tsrtc, vajra buses, lose, sales proposal, cm kcr, telangana government

Next Story

Most Viewed