ఆ రూ.90 కోట్లు ఎవరివి.?

by  |
ఆ రూ.90 కోట్లు ఎవరివి.?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ పార్టీలకు ప్రతి ఏటా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రూ.కోట్లు వచ్చి చేరుతున్నాయి. వీటిని సంబంధించిన వివరాలు మాత్రం ఇచ్చిన వారికి, పుచ్చుకున్న వారికి తప్పా వేరెవరికి తెలిసే చాన్స్ లేదు. గత నెలలో దేశం మొత్తంగా రూ.282.29 కోట్ల మేర ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పొలిటికల్ ఫండింగ్ రాగా అందులో రూ. 90 కోట్లు హైదరాబాద్‌లోనే నగదులోకి మారాయి. గ్రేటర్ ఎన్నికల ముందు వచ్చి ఈ డబ్బు ఏ పార్టీకి చెందినదో అనే విషయం బయటకు రాలేదు.

ఆ రెండు పార్టీలదేనని అనుమానం

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఓటర్లకు నగదును భారీ మొత్తంలో పంపిణీ చేశారనే విషయం బహిరంగ రహస్యమే. నవంబరులో నగదులోకి మారిన డబ్బు ఈ రెండు పార్టీలదే కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించే నివేదికలో ఈ డబ్బు ఏ పార్టీకి చేరిందో తెలిసిపోతుంది. నిబంధనల ప్రకారం ఎలక్టోరల్ బాండ్లు విరాళంగా వచ్చాక 15 రోజుల్లో దాన్ని నగదులోకి మార్చుకోవాలి. లేదంటే అది ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి చేరుతుంది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయో అనే విషయాన్ని అన్ని పార్టీలూ ఏడాదిన్నరలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందించాలి. కానీ దేశంలో కేవలం 4 పార్టీలు తప్పా మిగతా ఏ పార్టీలూ 2019 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన వివరాలను కమిషన్ కు నేటికీ సమర్పించలేదు. నిబంధనల ప్రకారం వివరాలు సమర్పిస్తే ఆ రూ.90 కోట్లు ఏ పార్టీవో ఏడాదిన్నర తర్వాత తెలుస్తుంది.

ముంబైలో ఒక్కో బాండ్ రూ.కోటి

ఎన్నికల సంస్కరణల్లో భాగంగా రెండేండ్లుగా ఎలక్టోరల్ బాండ్ల విక్రయం జరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 14 విడతలుగా బాండ్ల అమ్మకాలు జరగగా, గతేడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్‌లో గరిష్ట స్థాయిలో ఒకే విడతలో (9వ ఫేజ్) రూ.2,256 కోట్ల, తర్వాతి నెలలో 10వ ఫేజ్‌లో మరో రూ.922 కోట్ల మేర బాండ్ల అమ్మకాలు జరిగాయి. అప్పటి నుంచి మరో మూడు విడతల్లో బాండ్ల విక్రయాలు జరిగినా నవంబరు నెల(14వ ఫేజ్)లోనే అత్యధికంగా నమోదైంది. ముంబాయి నగరంలో ఒక్కో బాండ్‌ను రూ.కోటి చొప్పున కొనుగోలు చేసి పొలిటికల్ ఫండింగ్ పేరుతో విరాళంగా ఇచ్చారు. విరాళాలు ఇచ్చింది వ్యక్తులా? లేక సంస్థలా? అనేది నివేదిక సమర్పించాక తెలుస్తుంది. ఇప్పటివరకు మొత్తం 14 ఫేజ్‌లలో సుమారు రూ.ఆరున్నర వేల కోట్ల మేర బాండ్ల విక్రయం జరిగితే అందులో సుమారు రూ.5 వేల కోట్లు ఢిల్లీలోనే నగదులోకి మారాయి. ఆ తర్వాతి స్థానం హైదరాబాద్ నగరానిదే. బాండ్లు కొనేవారు హైదరాబాద్‌లో తక్కువే అయినా నగదులోకి మారుతున్న ప్రాంతాల్లో మాత్రం రెండో స్థానంలో ఉంది. తాజాగా నవంబర్‌లో అమ్ముడుపోయిన 321 బాండ్ల (రూ.282.29 కోట్లు)లో 90 హైదరాబాద్ నగరంలోనే నగదులోకి మారాయి. ఇవన్నీ అన్నీ రూ.కోటి బాండ్లే. గ్రేటర్ ఎన్నికల సమయంలో ఈ బాండ్లు హైదరాబాద్‌లో నగదులోకి మార్పిడి కావడం గమనార్హం. ఇదంతా టీఆర్ఎస్ లేదా బీజేపీకి చెందిన పొలిటికల్ ఫండింగ్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పార్టీలకు గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏ మేరకు పొలిటికల్ ఫండింగ్ వచ్చిందనే నివేదికలు నేటికీ సమర్పించలేదు.

Next Story

Most Viewed