మమ్మల్ని ఆదుకోండి.. నష్టం రూ.5వేల కోట్లు : కేసీఆర్

by  |
మమ్మల్ని ఆదుకోండి.. నష్టం రూ.5వేల కోట్లు : కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జల విలయం సృష్టించిన వానలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ. ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. బాధితులను తక్షణమే ఆదుకునేందుకు పునరావాస, పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు వీలుగా రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రైతుల కోసం రూ.600 కోట్లు, జీహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రాంతాకు రూ.750 కోట్లు అవసరం ఉంటాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలతో తలెత్తిన పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సీఎం గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహాయ, పునరావాస చర్యలను సమీక్షించారు. జీహెచ్ఎంసీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. జల విలయం కారణంగా గురువారం నాటికి 50 మంది మరణించారని, జీహెచ్ఎంసీ పరిధిలోనే 11 మంది ఉన్నారని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.

నీట మునిగిన పంటలు

రాష్ట్రవ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని, వాటి విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని చెప్పారు. నగరంలో 1916 తర్వాత ఒకేరోజు 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. నగరంలోని 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో 20,540 ఇండ్లు నీటిలో చిక్కుకున్నట్లు వెల్లడించారు. 35 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయమని, ఎల్‌బీ నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువగా ఉదని వివరించారు. 14 ఇండ్లు పూర్తిగా, 65 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. జీహెచ్ఎంసీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. 445 చోట్ల బీటీ రోడ్లు, 6 చోట్ల నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయని నివేదించారు. అన్ని ప్రాంతాల్లో రోడ్లను పునరుద్ధరిస్తున్నామన్నారు. 72 చోట్ల పునరావాస కేంద్రాలు ప్రారంభించి, ప్రభావిత ప్రజలకు తాత్కాలిక ఆవాసం, భోజనం కల్పించామని, ఇండ్లలో నీళ్లు చేరడంతో రోజుకు దాదాపు లక్షా పది వేల మందికి భోజనం అందిస్తున్నామని వెల్లడించారు.

కాలనీలు జలమయం

రాష్ట్రంలోని 30 పట్టణాల్లో వర్షాలు, వరదల ప్రభావం ఉందని, 238 కాలనీలు జలమయమయ్యాయని, 150 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని వివరించారు. 26 సబ్ స్టేషన్లలోకి నీళ్లు వచ్చాయని, అన్ని చోట్ల నీళ్లను తొలగించామని అన్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నామన్నారు. చాలా చోట్ల ట్రాన్స్ ఫార్మర్లు, కరెంటు స్తంభాలు కొట్టుకుపోయాయని, విద్యుత్ శాఖకు దాదాపు రూ. ఐదు కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. 101 చెరువు కట్టలు తెగాయన్నారు. జల వనరుల శాఖకు రూ.50 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. పంచాయతీ రాజ్ శాఖ రోడ్లు 475 చోట్ల దెబ్బతిన్నాయని, 269 చోట్ల రోడ్లు తెగిపోయాయని, రూ.295 కోట్ల వరకు నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఆర్అండ్‌బీ రోడ్లు 113 చోట్ల దెబ్బతిన్నాయని, ఆర్అండ్‌బీ పరిధిలో రూ.184 కోట్లు, నేషనల్ హైవేస్ పరిధిలో రూ.11 కోట్లు నష్టం జరిగినట్లు నివేదికల్లో పేర్కొన్నారు.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు..

బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బియ్యం, పప్పు, నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతి ఇంటికి మూడు చొప్పున రగ్గులను వెంటనే అందించాలని సూచించారు. సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జీహెచ్ఎంసీకి రూ. 5 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని, వాటి స్థానంలో కొత్త ఇండ్ల నిర్మిస్తామన్నారు.

ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకు నీళ్లు పూర్తిగా తొలగిన తర్వాతనే విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఇక నుంచి అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సందర్భంలో వరద నీరు సెల్లార్లలో నిలిచి ఉండకుండా ఉండే ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టాలన్నారు. ఇండ్లపై హై టెన్షన్ లైన్లు పోయే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ లైన్ల తొలగింపునకు కార్యాచరణ రూపొందించాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండి రఘుమారెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Next Story