రూ.50 వేలు రాబట్టుకోవడానికి రూ.36 లక్షలు ఖర్చు

by  |
Online trading
X

దిశ, వెబ్‌డెస్క్ : 50 వేల రూపాయలను బదులుగా ఇచ్చి.. వాటిని తిరిగి రాబట్టుకునేందుకు రూ.36 లక్షలను ఖర్చు చేశాడో వ్యక్తి. డాలర్లపై ఉన్న మోజు, ఆన్‌లైన్ వ్యాపారంలో లక్షకు రెండు లక్షలు వస్తాయనే ఆశకు పోయి మాయగాడి చేతిలో లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. మోసగాడు మాత్రం వచ్చిన డబ్బులతో గోవా చెక్కేసి ఎంజాయ్ చేశాడు. హైదరాబాద్‌లోని ఓల్డ్ మలక్ పేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చాదర్‌ఘాట్ క్రైం ఇన్‌స్పెక్టర్ నాగరాజు వెల్లడించారు.

మైసారి సంతోష్‌ (30) ఓల్డ్‌ మలక్‌పేట రేస్‌ కోర్సు రోడ్‌ మటన్‌ మార్కెట్‌ ఎదుట నివాసముంటున్నాడు. బీటెక్‌ ద్వితీయ సంవత్సరం వరకు చదివి మానేశాడు. ఆ తర్వాత 2017 నుంచి ఇంటర్నెట్ షాపు నడుపుతూ ఆన్‌లైన్ వ్యాపారాలు చేయడం, వాటితో మోసాలు ఎలా చేయలో తెలుసుకున్నాడు. ఈ క్రమంలో సంతోష్ తండ్రి మోహన్ స్నేహితుడి నుంచి ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్నానని రూ.50 వేలు బదులుగా తీసుకున్నాడు. బిట్‌ కాయిన్‌, నెట్లర్‌, క్రిప్టో కరెన్సీలో రూ.50 వేలు పెట్టుబడి పెడితే తెల్లారేసరికి రూ.లక్ష వస్తుందని నమ్మబలికాడు. తన ఇంటర్నెట్ నాలెడ్జితో తన బ్యాంకు ఖాతాలైన ఎస్బీఐ, ఎంట్రో పేలో వేలాది డాలర్లు ఉన్నట్లు క్రియేట్ చేసి స్క్రీన్ షాట్ తీసి మిత్రులకు, అప్పులు ఇచ్చిన వారికి పోస్ట్ చేశాడు. మీ డబ్బులు ఇవ్వాలంటే డాలర్లు డ్రా చేసుకోవాలని, వాటి కోసం ట్యాక్సీలు కట్టాలని వారిలో నమ్మకం కలిగించాడు.

దీంతో అప్పటికే రూ.50 వేలు ఇచ్చిన హరినాథ్.. బ్యాంకులో రూ.15 లక్షలు లోన్ తీసుకుని, వాటికి మరికొన్ని కలిపి రూ.38 లక్షలు సంతోష్‌కు ఇచ్చాడు. అతడితోపాటు ఎల్‌బీనగర్‌‌కు చెందిన సూరజ్‌ కిరణ్‌ రూ.6 లక్షలు, ముంబాయి ప్రాంతవాసి ఆదిల్‌ షా నుంచి రూ.లక్షన్నర తీసుకున్నాడు. సంతోష్.. ఈ డబ్బులన్నీ తీసుకుని గోవా వెళ్లి అక్కడ జల్సాలు చేశాడు. అప్పులు ఇచ్చిన వారికి డబ్బులకు బదులు చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ చెక్కులు బౌన్స్ కావడంతో బాధితులు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నుమోదు చేసిన పోలీసులు సంతోష్‌ను అరెస్ట్ చేశారు.

కాగా, ఆన్‌లైన్ వ్యాపారం పేరిట సంతోష్ చేతిలో మోసపోయిన వారుంటే చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఇన్‌స్పెక్టర్ సతీష్ తెలిపారు. సంతోష్‌పై గతంలోనూ రెండు కేసులు నమోదైనట్లు ఆయన చెప్పారు. వరస నేరాలకు పాల్పడుతున్న నిందితుడు సంతోష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపాడు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.



Next Story

Most Viewed