రేపో.. ఎల్లుండో.. ఖాతాల్లోకి రూ.1500

by  |

దిశ, న్యూస్ బ్యూరో: ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో లబ్ధిదారులకు రూ.1500 బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 12 కేజీల బియ్యంతోపాటు సీఎం కేసీఆర్ ఈ నగదు సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 71 శాతం మందికి అంటే 62 లక్షల మందికి 12 కిలోల బియ్యం అందిందని తెలిపారు. ఈ రబీ సీజన్‌లో పండిన రికార్డు స్థాయి ధాన్యం సేకరణ కోసం గన్నీ బ్యాగులను సమకూర్చుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 17 వేల 200 రేషన్ షాపులో ఉన్న గన్నీ బ్యాగ్స్ ఇవ్వాలని రేషన్ డీలర్లను కోరామని, వీటి ద్వారా 60 నుంచి 70 లక్షల గన్నీ బ్యాగులు రేషన్ దుకాణాల నుంచి వస్తాయని తెలిపారు. రేషన్ షాపు డీలర్లు వెంటనే సివిల్ సప్లైస్ డిపో మేనేజర్‌లకు గన్నీ బ్యాగులు అందజేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 10 కోట్ల బ్యాగులు ఇప్పటికే సమకూర్చుకున్నట్టు చెప్పారు. కొత్త బ్యాగులతో పాటు పాత బ్యాగులుంటే కూడా పంపించాలని బెంగాల్‌లోని జూట్ మిల్స్‌ను కోరామని తెలిపారు. పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వారు బయోమెట్రిక్ ద్వారానే తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Tags: corona, lockdown, pds, cash transfer, gunny bags, civil supplies chairman

Next Story

Most Viewed