కరోనా బాధితులకు ‘టీబీ’ భయం… జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు

by  |
కరోనా బాధితులకు ‘టీబీ’ భయం… జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా నుంచి కోలుకున్న బాధితులకు టీబీ(ట్యూబర్ క్యూలోసిస్) భయం పట్టుకున్నది. కొవిడ్ ప్రభావంతో ఇమ్యూనిటీ తగ్గడం వలన టీబీ ఎటాక్ అవుతుందేమోనని జనాలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏకంగా 31,680 న్యూ ఇన్ ఫెక్షన్లు తేలినట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. వీరిలో 50 శాతం మందికి కొవిడ్ తర్వాతనే వ్యాధి నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. అయితే కొవిడ్ సోకిన వారు తప్పనిసరిగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, లేదంటే పోస్టు కొవిడ్ సమస్యలతో పాటు టీబీ కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నదని టీబీ బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు.

కొవిడ్ సోకిన వాళ్లందరికీ టీబీ టెస్టులు..

రాష్ర్టంలో కొవిడ్ సోకిన వాళ్లందరికీ టీబీ టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. టీబీ బాధితులను వేగంగా గుర్తించడంతో పాటు సత్వరమే చికిత్సను అందించేందుకు టీబీ సర్వేను నిర్వహించనున్నారు. ఇంటింటికి తిరిగి టీబీ శాంపిల్స్ సేకరించనున్నారు. టీబీ పాజిటివ్ వచ్చినోళ్లకు వెంటనే మందులు పంపిణీ చేయనున్నారు. తద్వారా టీబీ తీవ్రతను అంచనా వేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.

స్ట్రెస్‌తోనే అత్యధికం…

స్ట్రెస్‌తో టీబీ(ట్యూబర్ క్యూలోసిస్) వ్యాధి పెరుగుతున్నది. కార్యాలయాల్లో పనిచేసే వారితో పోల్చితే వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల్లో ఇది మరింత ఎక్కువైందని టీబీ వ్యాధి నియంత్రణ అధికారులు గుర్తించారు. ఇళ్లల్లో ఆఫీస్ సమయం కంటే అదనంగా పనిచేయడం, ఎక్కువ సమయం ఒంటరిగా కంప్యూటర్ల ముందు కూర్చోవడంతో ఇమ్యూనిటీ(రోగ నిరోధక శక్తి) తగ్గి, శరీరంలో ట్యూబర్ క్యూలోసిస్ బ్యాక్టీరియా ప్రభావం పెరుగుతున్నట్లు టీబీ బోర్డు పరిశీనలతో తేలింది. కరోనా తర్వాత ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ టీబీ విభాగం చెబుతున్నది. లాక్ డౌన్, వైరస్ తీవ్రతతో చాలా మంది వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నారు. దీంతో పని ఒత్తిడి పెరగడమే కాకుండా, మానసిక సమస్యలు వస్తున్నాయని, తద్వారా ఆటోమెటిక్ గా ఇమ్యూనిటీ తగ్గుతుందని డాక్టర్లు వివరిస్తున్నారు.

తాత్కాలికంగా తగ్గినా..

కరోనా, టీబీ వ్యాధులు రెండూ లంగ్స్ పైన ప్రభావం చూపుతాయి. ఇంచుమించు రెండింటి వ్యాధి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. ఈ క్రమంలో లక్షణాలు తేలిన వారంతా కరోనా మందులు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో టీబీ బ్యాక్టీరియా తాత్కాలికంగా తగ్గినట్టు ఉన్నా, ఆ తర్వాత తిరగపెడుతుందని టీబీ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఇతర లక్షణాలు కనిపించగానే వైద్యుడి సలహా లేకుండా యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ డ్రగ్స్ వాడటం అత్యంత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత మందులతో కూడా టీబీ అదుపులోకి రాని పరిస్థితి ఉంటుందన్నారు.

హైదరాబాద్, రంగారెడ్డిలలో అత్యధికం..

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 31,680 టీబీ కేసులు నమోదవగా, అత్యధికంగా హైదరాబాద్ లో 6,238, రంగారెడ్డి జిల్లాలో 2,308 కేసులు తేలగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో కేవలం 338 కేసులు రికార్డు అయ్యాయి. అదే విధంగా కోమరం భీం ఆసీఫాబాద్ లో 685, గద్వాలలో 1,006, నాగర్ కర్నూల్ లో 1,106, కొత్తగూడెంలో 1,279, ఆదిలాబాద్ లో 728, వనపర్తిలో 635, సిద్ధిపేట్ లో 1091, సూర్యాపేట్ లో 1038, మహబూబ్ నగర్ లో 863, నారాయణపేట్ లో 447, మంచిర్యాలలో 622, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 1,641, భూపాలపల్లిలో 413, మెదక్ లో 768, సిరిసిల్లాలో 543, కామారెడ్డిలో 770, జగిత్యాలలో 787, యాదాద్రిలో 595, సంగారెడ్డిలో 914, నిర్మల్ లో 581, మహబూబాబాద్ లో 586, నిజామాబాద్ లో 815, నల్లగొండలో 908, పెద్దపల్లిలో 606, జనగామలో 385, ఖమ్మంలో 803, వికారాబాద్ లో 533, వరంగల్ రూరల్ లో 436, వరంగల్ అర్బన్ లో 577, కరీంనగర్ లో 635 కేసులు చొప్పున తేలాయి. అయితే వీటిలో 65 శాతం మంది 20 నుంచి 45 ఏళ్లు వారే అత్యధికంగా ఉండటం గమనార్హం. ఇక పట్టణాల్లో శారీరక శ్రమ లేకపోవం, మానసిక ఒత్తిళ్లు, కాలుష్యం, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల టీబీ పెరుగుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో పొగాకు వినియోగం ప్రధాన కారణంగా నిలుస్తున్నట్లు టీబీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

కమ్యూనిటీ ఎంగెజ్మెంట్ ప్రచారం…

దేశ వ్యాప్తంగా 2025 వరకు టీబీ వ్యాధిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న టీబీ హరేగా, దేశ్ జితేగా ట్యాగ్ లైన్ తో ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నది. ప్రతి జిల్లాలో ఇప్పటికే టీబీ వ్యాధిని జయించిన వారితో అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారి కోసం టీబీ బోర్డు ఆహ్వానిస్తున్నది. ప్రతీ టీంలో టీబీ విజేతతో పాటు రాష్ర్ట, జిల్లా, మండల స్థాయి అధికారులు ఉండనున్నారు. గ్రామాల్లో టీబీ వర్క్ షాపులతో పాటు స్ర్కీనింగ్ లను కూడా నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, గ్రామ స్థాయి అధికారులనూ భాగస్వామ్యం చేయనున్నారు.

ఆలస్యంగా గుర్తించడంతోనే మరణాలు..

రాష్ట్రంలో ప్రతీ ఏటా టీబీ డెత్ రేట్ 3 నుంచి 5 శాతం ఉండగా, వ్యాధిని సకాలంలో గుర్తించలేనందునే టీబీ మరణాలు సంభవిస్తున్నట్లు డాక్టర్లు పేర్కొంటున్నారు. లక్షణాలు తేలినా టీబీ టెస్టులు కాకుండా ఇతర పరీక్షలు నిర్వహించుకొని యాంటీ బయోటిక్స్ వాడుతున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. మరోవైపు టీబీ లక్షణాలను గుర్తించడంలో చదువుకున్న వారు సైతం అవగాహన లేకుండా గుర్తించలేకపోవడం గమనార్హం. దీంతో వ్యాధి ముదిరి ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిక్, ఎయిడ్స్‌, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగులపై టీబీ దాడి ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో 3 వారాలకు మించి దగ్గు ఉన్నా, రాత్రి వేళలో తరుచూ జ్వరం వస్తున్నా, ఆకలి మందగించినా, అకస్మాత్తుగా బరువు తగ్గినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

టీబీ ఆరోగ్య సాథి యాప్‌తో నిర్మూలన..

టీబీ వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. టెక్నాలజీని వినియోగించుకొని 2025 వరకు టీబీని పూర్తిగా నియంత్రించేందుకు టీబీ ఆరోగ్య సాథి అనే యాప్ ను ప్రవేశపెట్టినది. ఇది పేషెంట్ కు, ఆరోగ్య సిబ్బందికి మధ్య వారధిగా పనిచేస్తుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దీనిలో టీబీకి సంబంధించిన సేవలు, అధికారుల వివరాలు, లక్షణాలు, సందేహాలు, పౌష్ఠికాహారం వివరాలు, ఉచిత మెడికల్ కాల్ సెంటర్, నిర్ధారణ పరీక్షల వివరాలు, చికిత్స ప్రోటోకాల్ వంటివి పొందుపరచడం జరిగిందని టీబీ బోర్డు తెలిపింది. వీటిలో వివరాలు నమోదు చేసుకోని పరీక్షలు, చికిత్స ఉచితంగా పొందవచ్చని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. అంతేగాక నిక్షయ్‌ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్న వారూ ఉచితంగా పౌష్టికాహారం పొందవచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌ లోడ్‌ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

6 నెలల్లో అత్యధికంగా టీబీ కేసులు నమోదైన జిల్లాలు

జిల్లా కేసులు

హైదరాబాద్ 6,238
రంగారెడ్డి 2,308
మేడ్చల్ 1,641
కొత్తగూడెం 1,279
నాగర్ కర్నూల్ 1,106
గద్వాల 1,006
సిద్ధిపేట్ 1,091
సూర్యాపేట్ 1,038
సంగారెడ్డి 914
నల్గగొండ 908
మహబూబ్నగర్ 863


Next Story

Most Viewed