వారి ఒప్పందంపై మార్కెట్ వర్గాల్లో నిరాశ!

by  |
వారి ఒప్పందంపై మార్కెట్ వర్గాల్లో నిరాశ!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు, ప్రభుత్వాలే తలలు పట్టుకుంటే భారత దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం గతేడాది ఉంచిన లక్ష్యాలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ చరిత్ర రికార్డులను సాధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో కీలక ప్రకటనలు వస్తాయని మార్కెట్ వర్గాలు భావించాయి. అయితే, ప్రధానమైన సౌదీ ఆరామ్-కోతో ఒప్పందంపై కీలక ప్రకటన వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో బుధవారం రిలయన్స్ షేర్లపై దీని ప్రభావం పడింది.

ఏజీఎంకు ముందు రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడయినప్పటికీ సౌదీ ఆరామ్-కోతో ఒప్పందం గురించి అప్‌డేట్ లేకపోవడంతో రిలయన్స్ షేర్ 6.15 శాతం వరకూ దిగజారింది. దీంతో మంగళవారం రిలయన్స్ సంస్థ రూ. 12 లక్షల కోట్ల రికార్డును దాటినప్పటికీ బుధవారం నాటి పరిణామాలతో మార్కెట్ ముగిసే సమయానికి 3.71 శాతం మేర నష్టపోయి షేర్ ధర రూ. 1,845.60 వద్ద క్లోజయింది. అలాగే, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 1.26 లక్షల కోట్లు పడిపోయి రూ. 11.7 లక్షల కోట్లకు తగ్గింది. ఏజీఎంలో సౌదీ ఆరామ్-కోతో ఒప్పందం అంశంపై అందరూ సానుకూలతను ఆశించారని, అయితే ఎలాంటి పురోగతి లేకపోవడం మార్కెట్ వర్గాలు నిరాశ చెందాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గూగుల్ భాగస్వామ్యం, ఇతర ప్రకటనలు ఇదివరకు తెలిసిన అంశాలే కావడంతో ఏజీఎం సమావేశంలో సౌదీ ఆరామ్-కో అంశమే కీలకంగా భావించారని మార్కెట్ నిపుణులు భావించారు. కానీ, సౌదీ ఆరామ్-కోతో సుధీర్ఘమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్టు ముఖేశ్ ప్రకటన కేవలం ప్రస్తావనకే పరిమితం అయ్యిందని నిపుణులు గుర్తుచేశారు.


Next Story