వస్త్ర రంగంలోనే కోటి జాబ్స్ ఊస్ట్ !

by  |
వస్త్ర రంగంలోనే కోటి జాబ్స్ ఊస్ట్ !
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చితికిపోయిన తమకు ప్యాకేజీ ప్రకటించాలని పలు రకాల వ్యాపారాల అసోసియేషన్‌లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. రిటెలయిర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) సోమవారం పలు వ్యాపారాల పరిస్థితిపై సమీక్షించడానికి వెబినార్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ), క్లోతింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. లాక్‌డౌన్ వల్ల ఒక్క వస్త్ర తయారీ రంగంలోనే కోటి వరకు ఉద్యోగాలు పోయే ప్రమాదముందని టెక్స్‌టైల్ రంగ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో రిటైల్, వస్త్రాలు తయారు చేసే చిన్న చిన్న పరిశ్రమలు మొత్తం దివాలా తీసేలా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలివ్వడం, రెంట్లు, కరెంటు బిల్లులు మాఫీ లాంటివి ప్రకటించకపోతే ఈ రంగం ఇప్పట్లో కోలుకోదన్నారు. ఇక రెస్టారెంట్ రంగంలోనూ కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని ఎన్ఆర్ఏఐ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖర్చు అధికంగా ఉండే ఈ రంగంలో ఉద్యోగాలు తీసేసే ప్రమాదమెక్కువ ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ టైంలో ఉద్యోగం కోల్పోతే మళ్లీ జాబ్ దొరకడం సైతం కష్టమేనని వారు తెలిపారు. కనీసం 2నుంచి 3నెలల వరకైనా తమను ఆదుకుంటే తమ పరిశ్రమలు నిలదొక్కుకొని పోరాటం చేయగలుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ఏఐ ఫౌండర్ ప్రెసిడెంట్ బి.ఎస్ నగేష్, ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు అనురాగ్ కత్రియార్, వస్త్ర తయారీదారుల అసోషియేషన్ చీఫ్ మెంటార్ రాహుల్ మెహతా తదితరులు పాల్గొన్నారు.

tags :corona, lockdown, retailers, apparel, restaurant, job losses


Next Story

Most Viewed