రెవె‘న్యూ’ బిల్లు ఏకగ్రీవం..!

by  |
రెవె‘న్యూ’ బిల్లు ఏకగ్రీవం..!
X

చరిత్రాత్మక బిల్లు అంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ కొత్త బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యులు పలు సవరణలను ప్రతిపాదించినా సభ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. వారి అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదు. కాకపోతే, వారు చేసిన పలు సూచనలకు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగిన చర్చ అనంతరం బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

దిశ, న్యూస్‌బ్యూరో: అవినీతికి తావులేని తీరులో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితం అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. ‘తెలంగాణ భూమి హక్కులు-పట్టాదారు పాస్‌బుక్‌ బిల్లు-2020’ ‘వీఆర్‌ఓ పోస్టుల రద్దు బిల్లు-2020’ అనే ఈ రెండు బిల్లుల మీద శుక్రవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే చర్చ మొదలైంది. బిల్లులపై రెండు రోజుల క్రితమే వివరణ ఇచ్చినందున విపక్ష సభ్యులు తగిన సూచనలు చేయవచ్చని, వాటిని పరిగణనలోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. చర్చల అనంతరం బిల్లులను ఆమోదించాల్సిందిగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మజ్లిస్ తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ తరఫున మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, బీజేపీ తరఫున రాజాసింగ్ పాటు అధికార పార్టీకి చెందిన సభ్యులు మాట్లాడారు.

దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందిగా స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. సభ్యులు లేవనెత్తిన సందేహాలన్నింటికీ స్పష్టత ఇచ్చినందున సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని సీఎం సభకు వివరించారు. ఇంకా సందేహాలుంటే ఇప్పటికిప్పుడే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. విపక్ష సభ్యులు అనేక సూచనలు చేసి, కొన్ని సవరణలను ప్రతిపాదించినా సీఎం వాటికి అంగీకరించలేదు. చివరకు ఎలాంటి వ్యతిరేకత లేకుండానే రెండు బిల్లులకు సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. వీటితోపాటు మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు కూడా సభ ఆమోదం లభించినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

ఒక్క రోజులోనే..

రెవెన్యూ బిల్లులను సభలో ప్రవేశపెట్టిన తర్వాత రెండు రోజుల పాటు చర్చకు అసెంబ్లీ షెడ్యూలు ఖరారైంది. ముఖ్యమంత్రి వీటిపై రెండు రోజుల క్రితం వివరణ ఇచ్చిన తర్వాత ఒక్క రోజు చర్చకే షెడ్యూలు మారిపోయింది. దీంతో అనుకున్నట్లుగా శుక్రవారం ఉదయం చర్చ మొదలైంది. సాయంత్రానికి బిల్లులకు ఆమోదం లభించింది. సభ నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విజయచిహ్నంతో సభలోనే సంతోషాన్ని వ్యక్తం చేశారు. అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి మద్దతు తెలిపారు. ఎలాంటి సవరణలు లేకుండా ఏకగ్రీవంగా ఆమోదం లభించడంతో సభా కార్యకలాపాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ బిల్లులపై శాసనమండలిలో చర్చ జరగాల్సి ఉంది. సోమవారం అక్కడ కూడా ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది.

ఈ ప్రశ్రలకు బదులేది?

కొత్త రెవెన్యూ బిల్లుకు సంబంధించి ఆచరణాత్మక అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు. దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాత్రం పదాల నిర్వచనంతో పాటు సాంకేతిక, లీగల్ అంశాలను ప్రస్తావించారు. సమగ్ర భూ సర్వే ఎప్పుడు ప్రారంభిస్తారు? ధరణి పోర్టల్ ఆధారంగానే కొత్త చట్టం పనిచేస్తున్నందున వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైతే ప్రత్యామ్నాయం ఏమిటి? భూ రికార్డుల ప్రక్షాళనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దడం ఎలా? ప్రస్తుతం క్షేత్రస్థాయిలో భౌతికంగా ఉన్న భూమి వివరాలకు, రికార్డుల్లో నమోదైన గణాంకాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరిదిద్దడం ఎలా? అసైన్డ్ భూముల సమస్యలకు పరిష్కారం ఎలా? పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తిరిగి ప్రభుత్వమే ఎందుకు తీసుకుంటోంది? రైతుబంధు సమితి వేదికల కోసం అసైన్డ్ భూములను రైతుల నుంచి ఎందుకు లాక్కుంటోంది? వైకుంఠధామాల నిర్మాణం కోసం వెనక్కి ఎందుకు తీసుకుంటోంది? ఇలాంటి అనేక అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరారు.

సన్నకారు రైతులకు భరోసా ఇవ్వండి..

కొత్త బిల్లులో జాగీర్ లాంటి పలు పదాల నిర్వచనంతో పాటు సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టిషన్ డీడ్ తదితర అంశాలపై స్పష్టత లేదని కాంగ్రెస్ సభ్యుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. చట్టంగా రూపొందిన తర్వాత లీగల్ చిక్కులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భూ యజమానుల పేర్లలో, ఇతర వివరాల్లో అక్షర దోషాలు ఉంటే దాన్ని ఎవరు సరిచేయాలన్న వర్క్ డివిజన్ లేదని, వివరాలను ఎవరు నమోదు చేయాలో కూడా స్పష్టత లేదని పేర్కొన్నారు.

తహసీల్దార్లపైనా లేదా ప్రభుత్వంపైనా కోర్టుల్లో దావా వేయడానికి వీలు లేదని సెక్షన్ 9లో చెబుతూనే, రికార్డులను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేస్తే తహసీల్దార్లను సర్వీసు నుంచి తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉంటుందంటూ సెక్షన్ 14లో పేర్కొనడం వైరుధ్యపూరితంగా ఉందని సభ ధృష్టికి తెచ్చారు. దీని మీద స్పష్టత ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. మొత్తం భూముల్లో దాదాపు 93% చిన్న కమతాలే అయినందున వివాదాలు వస్తే కోర్టులకు వెళ్ళాల్సి వస్తుందని, సన్నకారు రైతులకు ఆ మేరకు ఆర్థిక స్థోమత ఉండదని, వారికి ఉచితంగా న్యాయసేవ లభించేలా ప్రభుత్వం భరోసా కల్పించాలని సూచించారు.

వ్యక్తుల కోసం వ్యవస్థనే మారుస్తారా?

బీజేపీ సభ్యుడు రాజాసింగ్ మాట్లాడుతూ వీఆర్వోలను తొలగించడం సరేగానీ, వారు ఇప్పటివరకూ చేస్తున్న బాధ్యతలను ఇకపైన ఎవరు నిర్వహించాలో ప్రభుత్వం వివరించాలని కోరారు. వీఆర్వోలు మాత్రమే కాక తహసీల్దార్లు కూడా రైతుల నుంచి లంచాలను డిమాండ్ చేస్తున్నారని, ఇప్పుడు రిజిస్ట్రేషన్ బాధ్యతలను కూడా వారికే అప్పగిస్తే రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని సీఎంను ప్రశ్నించారు.

కొద్దిమంది వ్యక్తుల అవినీతి కారణంగా ఒక వ్యవస్థనే మార్చడం సమంజసమా? జవాబు చెప్పాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు కూడా లంచాలు తీసుకుంటున్నారని, కలెక్టర్లకూ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు కలెక్టర్ వ్యవస్థను కూడా తీసేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలకు సత్వర న్యాయం లభించేలా, అవినీతికి ఆస్కారం లేకుండా చేయడాన్ని తాను వ్యతిరేకించడంలేదని, లంచాలు అడిగినవారిపై చర్యలు తీసుకునేందుకు పటిష్టమైన చట్టం రావాలని సూచించారు.

సంస్కరణలకు నాంది మాత్రమే..

మజ్లిస్, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు చేసిన సూచనలను స్వాగతించిన సీఎం కేసీఆర్ వివరణలు ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో వీటి కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం చేపట్టిన రెవెన్యూ బిల్లు సవరణ కేవలం ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు. సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. ఉత్తమ సలహాలు ఇచ్చారని అభినందించారు. గతంలో సుమారు 170 రెవెన్యూ చట్టాలు ఉండేవని, ఇప్పుడు సగానికి తగ్గి 87కు చేరుకున్నాయని తెలిపారు.

ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాల విషయంలో మాత్రం ఇప్పుడు సంస్కరణలను తీసుకొస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని మార్పులు, చేర్పులు ఉంటాయని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారానే ఎక్కువ పనులు జరుగుతున్నందున ప్రైవేటు సంస్థకు ఇవ్వబోమని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టీఎస్‌టీఎస్ (తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్) ద్వారా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒక్క సర్వర్‌పై ఆధారపడకుండా పలు చోట్ల సర్వర్లను పెడతామన్నారు. ఈ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ భూములకు ఆకుపచ్చ, వ్యవసాయేతర భూములకు ఎరుపురంగు పాస్‌బుక్‌లను ఇవ్వనున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed