సీఎం కేసీఆర్‌ మోసాన్ని లేఖతో బయటపెట్టిన రేవంత్ రెడ్డి

by  |
Revanth-reddy-and-kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : గడిచిన ఏడున్నరేళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత, గిరిజన, ఆదివాసీలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోగా అనేక సందర్భాలలో వాళ్ల హక్కులను కాలరాస్తూ, అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన గురువారం సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ మొదలు, కుటుంబానికి మూడెకరాల భూమి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, బడ్జెట్‌లో ఏడాదికి రూ.10 వేల కోట్లు, పోడు భూములకు పట్టాల వరకు అన్నింట్లో వాళ్లను మోసం, దగా చేశారని ఆ లేఖలో ఆరోపించారు. గిరిజనులు, ఆదివాసీలు, దళితుల పట్ల టీఆర్ ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి నిర్లక్ష్యంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.

నేరేళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళిత యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అంత్యంత దుర్మార్గమైన చర్య అని వివరించారు. మిర్చీకి మద్దతు ధర అడిగిన గిరిజన రైతులకు ఖమ్మంలో బేడీలు వేసి, వారిని దొంగల్లా నడిరోడ్డు పై నడిపించి అవమానాలపాలు చేయడం సరైన చర్య కాదని స్పష్టం చేశారు. దీంతో పాటు మల్లన్న సాగర్ నిర్వాసితుల్లోనూ దళితులకే అన్యాయం చేస్తున్నారన్నారు. పోడు భూముల విషయంలో ఆదిలాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ లాంటి జిల్లాల్లో గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు.

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోనూ 20 మంది మహిళలను, పసిపిల్లల తల్లులను పోడు భూముల విషయంలో అరెస్టు చేయడం సమాజానికి సిగ్గు చేటని వివరించారు. అయితే అరెస్టయిన గిరిజన మహిళల పట్ల ఖమ్మం జిల్లా జైలు సిబ్బంది అమానవీయంగా వ్యవహరించినట్లు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని రేవంత్ గుర్తుచేశారు. అన్నం పెట్టమంటే జైలు సిబ్బంది తమతో కాళ్లు మొక్కించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో పాటు మహిళలు అనే మనవతా దృక్పదం లేకుండా బూతులు తిడుతూ కర్రలతో కొట్టడం, టాయిలెట్లు కడిగించడం వంటి చేయింయినట్లు రేవంత్ చెప్పారు. ఇలాంటి మానవత్వం లేని ఘటనలను కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం ఉపేక్షించదని, అమానుషంగా ప్రవర్తించి, మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డ సంబంధిత అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అంతేగాక సెప్టెంబర్ 17లోగా రాష్ట్రంలోని పోడు భూముల అన్నింటికీ పట్టాలు ఇవ్వాలని కోరారు.

రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఐటీడీఏలను పునరుద్ధరించే విధంగా నిధులు విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాలతో ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరింత ఉధృతం చేస్తామని ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.


Next Story

Most Viewed