అసెంబ్లీలో మీడియాపై ఆంక్షలెందుకు?

by  |

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తీవ్రత పెద్దగా లేదని, అంతా అదుపులోనే ఉన్నదనేది వైద్యారోగ్య శాఖ అధికారుల మాట. ఇంకా అదుపులోకి రాలేదని, వైరస్ వ్యాప్తి ఉన్నదనేది ప్రధాన కార్యదర్శి మాట. వైరస్ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉన్నప్పటికీ.. హుజూరాబాద్‌లో అన్ని పార్టీలూ యధావిధిగా వందలాది మందితో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సైతం గత నెల దళితబంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనం సైతం ఘనంగానే జరిగింది. కానీ అసెంబ్లీ సమావేశాల విషయం దగ్గర మాత్రం స్పీకర్, కార్యదర్శి మాత్రం కరోనా కారణంగా మీడియాకు ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో మీడియా సంస్థకు ఒకరు చొప్పున మాత్రమే హాజరయ్యేలా ప్రత్యేక పాస్‌లు జారీ అయ్యాయి.

రాష్ట్రమంతటా కరోనా తీవ్రత లేకుండా యధావిధిగా భారీ సంఖ్యలో జనం గుమికూడే కార్యక్రమాలు జరుగుతున్నా.. అసెంబ్లీ సమావేశాల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ప్రభుత్వానికి కరోనా ఆంక్షలు గుర్తుకొచ్చాయి. ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ కరోనా ఆంక్షలే అడ్డం వచ్చాయి. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక విషయంలో సైతం కరోనా ఇంకా అదుపులోకి రాలేదని, ఇప్పుడు ఎలక్షన్లు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల వివరించింది. పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, కార్యాచరణతో రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నదా? లేక ఇంకా పరిస్థితి కంట్రోల్‌లోకి రాలేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గణేశ్ నిమజ్జనం కార్యక్రమాన్ని కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులకు నగర పోలీసు శాఖ ప్రత్యేకంగా పాసులు మంజూరు చేసింది. కరోనా ఆంక్షలేవీ పెద్దగా అడ్డం రాలేదు. ప్రజలు కూడా వారి ఇష్ట ప్రకారం నిమజ్జన ప్రక్రియను వీక్షించడానికి పోలీసులు అవకాశం కల్పించారు. వినాయక విగ్రహాల ఊరేగింపు విషయంలోనూ ఇదే కనిపించింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ళు, క్యాబ్ సర్వీసులు, ఆటోలు, సినిమా థియేటర్లు, క్లబ్‌లు, పబ్‌లు.. ఇలా అన్ని చోట్ల సాధారణ పరిస్థితులే నెలకొన్నాయి. ఇక్కడ కరోనా నిబంధనల పేరుతో ఎలాంటి ఆంక్షలు లేకపోయినా అసెంబ్లీ సమావేశాల విషయంలో మాత్రమే మీడియాకు ఆంక్షలు పెట్టడంలోని ఆంతర్యం అర్థం కావడం లేదు. సామాన్యులు తిరిగే స్థలాల్లో ఒక రకమైన కొవిడ్ నిబంధనలు, వీఐపీలుగా చెప్పుకునే ప్రజాప్రతినిధులు హాజరయ్యే అసెంబ్లీ సమావేశాలకు మరో రకమైన నిబంధనలా? అనే ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం కరువైంది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story