షాపులపై ఆంక్షలు.. ఏపీ బాటలో తెలంగాణ

by  |
షాపులపై ఆంక్షలు.. ఏపీ బాటలో తెలంగాణ
X

ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణ ప్రభుత్వం నడవనుంది. మే 7 వరకూ లాక్‌డౌన్ అమలవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలను రోడ్లపైకి రాకుండా నియంత్రించడం పోలీసులకు తలకు మించిన భారమవుతోంది. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మరిన్ని కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఏపీ తరహా నిబంధనలను పరిశీలించి, అమలు చేయడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. దీంతో పలు ఆంక్షలు అమలులోకి తెచ్చారు.

ఇంటి చిరునామాకు 3 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లేందుకు అనుమతించ వద్దని, అడ్రస్ ప్రూఫ్ చూసిన తరువాతే వారిని అనుమతించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ ఆదేశించారు. అలాగే నిత్యావసర దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే తెరచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ కరోనాను నియంత్రించాలంటే మాత్రం ఆ ఆంక్షలు అమలు కావాల్సిందేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు దుకాణదారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసర వస్తువుల కావాలంటే ఉదయం 11 గంటల్లోగా తీసుకుని ఇళ్లకు చేరాలని, ఆపై బయటకు రావద్దని ప్రజలకు సూచించాలని ఆదేశించారు.

తెలంగాణలో ఇప్పటి వరకు సాయంత్రం 6 గంటల వరకు నిత్వావసర వస్తువులు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. దీనిపై నియంత్రణ విధిస్తే మూకుమ్మడిగా వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో కరోనా మరింత ప్రబలే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే సమయంలో ఆంక్షలు విధించలేదు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆంక్షలు విధించింది. కేవలం కిరణా సామాన్ల షాపులకే కాకుండా ఈ ఆంక్షల్లోకి వాణిజ్య సముదాయాలు, గవర్నమెంట్ ఆఫీసులు, పెట్రోలు బంకులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం ఉంది. అత్యవసర వైద్యానికి 100కు డయల్ చేస్తే పోలీసులే వారికి సాయం చేస్తారని తెలుస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను అతిక్రమించే వారిపై జాలి చూపరాదని, వారి వాహనాలు స్వాధీనం చేసుకోవాలని డీజీపీ ఆదేశించారు. కాగా, నిన్న ఒక్కరోజులో హైదరాబాద్ పరిధిలో నిబంధనలను ఉల్లంఘించిన 2,600 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, దీంతో ఇంతవరకూ పోలీసు స్టేషన్లకు చేరిన వాహనాల సంఖ్య 1.21 లక్షలు దాటింది. మరోరెండు వారాలు కఠినంగా వ్యవహరిస్తే, కరోనాను నియంత్రణలోకి తేవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Tags: telangana, andhrapradesh, lockdown rules, police, ts dgp, mahendaer reddy

Next Story

Most Viewed