రెడ్ అల‌ర్ట్‌.. ఉమ్మడి జిల్లాపై గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం

139
heavy rains

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: గులాబ్ తుఫాన్ ప్రభావం ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాపై తీవ్రంగా ఉంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన త‌ర్వాత మొద‌లైన వ‌ర్షం సోమ‌వారం రోజంతా కురుస్తూనే ఉండ‌టం గ‌మ‌నార్హం. దీంతో జ‌న జీవ‌నం స్తంభించిపోయింది. వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మ‌హ‌బూబాబాద్‌లో భారీ వ‌ర్షపాతం న‌మోదైంది. రానున్న 24 గంట‌ల్లో జ‌న‌గామ‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నాలుగు జిల్లాల‌ను వాతావ‌ర‌ణ శాఖ రెడ్ జోన్లలో చేర్చడంతో ఆయా జిల్లాల క‌లెక్టర్లు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూ‌మ్‌లను ఏర్పాటు చేశారు.

వ‌రంగ‌ల్‌ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యలు ప‌ట్టణంలోని లోత‌ట్టు ప్రాంతాల ప‌రిస్థితుల‌ను ఎప్పటిక‌ప్పుడు ప‌ర్యవేక్షిస్తున్నారు. నగరంలో జలమయమయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలకు సమీపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు సత్వర సహాయం అందించడానికి బల్దియా కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 18004251980 టోల్ ఫ్రీ, 9701999645 మొబైల్, 7997100300 వాట్సాప్ నెంబర్‌లతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఉధృతంగా గోదావ‌రి.. బ్యారేజీల‌కు వ‌ర‌ద ఉధృతి

అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు వరద తాకిడి పెరిగింది. అన్నారం బ్యారేజీలోకి ఎగువ ప్రాజెక్టుల నుండి 4.58.000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 66 గేట్లకు గాను 59 గేట్లు ఎత్తి, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం వ‌ద్ద గోదావ‌రి, ప్రాణ‌హిత న‌దుల‌ నీటిమ‌ట్టం 9.310 మీటర్లుగా ఉంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 4.92.200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో మేడిగడ్డ బ్యారేజీలోని 85 గేట్లకు గాను 79 గేట్లు ఎత్తి 5.48.500 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..