73 కోట్లు పలికిన షేక్‌స్పియర్ పుస్తకం..

by  |
73 కోట్లు పలికిన షేక్‌స్పియర్ పుస్తకం..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఆంగ్ల కవి, నాటక రచయిత షేక్‌స్పియర్ అందరికీ సుపరిచితుడే. ఆయన రాసిన పుస్తకాలు, నాటకాలను ఇప్పటికీ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందంటే అతిశయోక్తికాదు. ఆయనను గొప్ప ఆంగ్ల కవిగా, ప్రపంచ గొప్ప నాటక రచయితల్లో ఒకడిగా అభివర్ణిస్తారు. ఆయన రాసిన నాటకాల్లో చాలా వరకు ప్రపంచ భాషల్లో అనువాదం కూడా అయ్యాయి. ఎన్నో నాటకాలు సినిమాలుగా కూడా వచ్చాయి. ఆయన రాసిన మొదటి నాటకం ‘ఫస్ట్ ఫోలియో’. ఈ పుస్తకానికి సంబంధించిన కాపీలు చాలా అరుదుగా ఉన్నాయి. మొత్తంగా ఆరు మాత్రం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయి. తాజాగా ఫస్ట్ ఫోలియో పుస్తకాన్ని వేలం వేయగా 73 కోట్ల రూపాయల (9.97 మిలియన్ డాలర్లు) రికార్డు ధరకు అమ్ముడుపోయింది.

ఫస్ట్ ఫోలియో పుస్తకంలో మొత్తం 36 నాటకాలున్నాయి. 1623లో ఇంగ్లిష్ మాస్టర్ పబ్లికేషన్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. 20 ఏండ్లకు ముందు ఫస్ట్ ఫోలియో పూర్తి కాపీని వేలం వేయగా, మళ్లీ ఆనాటి నుంచి ఇప్పటివరకు ఈ పుస్తకం వేలానికి రాలేదు. న్యూయార్క్‌లోని క్రిస్టీ ఆక్షన్ కంపెనీ ‘ఫస్ట్ ఫోలియో’ పుస్తకాన్ని వేలానికి ఉంచింది. ఈ పుస్తకానికి 4 నుంచి 6 మిలియన్ డాలర్లు వస్తాయని వేలందారులు ఊహించారు. కానీ, అనూహ్యంగా ఈ పుస్తకం రికార్డు స్థాయిలో 9.97 మిలియన్ డాలర్ల ( రూ. 73 కోట్ల రూపాయలు)కు అమ్ముడుపోయింది. అమెరికాకు చెందిన బుక్ స్టోర్ యజమాని స్టీఫెన్ లొవెన్‌థెయిల్ ఇద్దరు పోటీదారులను వెనక్కినెట్టి ఈ పుస్తకాన్ని దక్కించుకున్నారు. మొత్తంగా ఆరు నిమిషాలపాటు టెలిఫోన్‌‌లో ఈ బిడ్ జరిగింది. ఇంతకు ముందు 2001లొ ఫస్ట్ ఫోలియో పుస్తకాన్ని వేలం వేయగా.. 6.16 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 45 కోట్లు)‌కు అమ్ముడుపోయింది.

Next Story

Most Viewed