టీకా ఉత్పత్తి కోసం భారత్‌వైపు అగ్రరాజ్యాల చూపు

by  |
టీకా ఉత్పత్తి కోసం భారత్‌వైపు అగ్రరాజ్యాల చూపు
X

న్యూఢిల్లీ : టీకా ఉత్పత్తిలో మనదేశానికి ప్రపంచంలోనే విశిష్ట ప్రాధాన్యత ఉన్నది. ఘనమైన ఉత్పత్తి సామర్థ్యం కారణంగా అగ్రరాజ్యాలు సైతం భారత్‌వైపు చూస్తున్నాయి. కరోనాను ఎదుర్కోవడానికి భారత్ స్వయంగా టీకాను అభివృద్ధి చేసుకోవడం, ఉత్పత్తి చేసి అతివేగంగా వ్యాక్సినేషన్ చేస్తుండటం విదేశాలు గమనిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, జపాన్ సహా ఇతర దేశాలు టీకా ఉత్పత్తి కోసం భారత్‌కు ఆర్థిక దన్నుగా నిలవడానికి సిద్ధమవుతున్నాయి. శుక్రవారం జరిగే క్వాడ్ గ్రూప్ దేశాల(భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) అధినేతల సమావేశంలో ఈ మేరకు ప్రకటన వెలువడనున్నట్టు అమెరికా పాలకవర్గాలు వివరించాయి.

శుక్రవారం జరిగే ఈ సమావేశంలో తొలిసారి క్వాడ్ గ్రూప్‌లోని దేశాధినేతలు హాజరవుతున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ అధినేతలు సమావేశమవుతున్నారు. ఈ భేటీలో సభ్య దేశాల మధ్య ఫైనాన్సింగ్ అగ్రిమెంట్ కుదరనుంది. అమెరికన్ డ్రగ్ మేకర్స్ నోవావాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీల టీకాలు ఇక్కడ ఉత్పత్తి చేసే కంపనీలపై ఈ అగ్రిమెంట్ ఫోకస్ పెట్టనున్నట్టు అమెరికాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. టీకా ఉత్పత్తి సవాళ్లను ఎదుర్కొని వేగంగా టీకా పంపిణీ చేపట్టడం, తద్వారా వైరస్ మ్యుటేషన్లను అడ్డుకోవడమే ఈ భేటీ లక్ష్యమని తెలిపారు. టీకా పంపిణీ వేగంగా పూర్తి చేసుకుంటే కొన్ని మ్యుటేషన్లను అడ్డుకునే అవకాశముంటుందని అన్నారు. భారత్‌లోని అదనపు టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆగ్నేయాసియా దేశాల్లో టీకా పంపిణీకి ఉపయోగించాలని భావిస్తున్నట్ట వివరించారు. చైనా ఆధిపత్యం పెరుగుతున్న తరుణంలో నాలుగు దేశాల అధినేతలు భేటీ కానుండటం విశేషం.



Next Story

Most Viewed