అమిత్ షాకు నిరసన సెగ

by  |
అమిత్ షాకు నిరసన సెగ
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కేంద్ర బలగమంతా హైదరాబాద్ నగరంలో చక్కర్లు కొడుతోంది. సెంటిమెంట్‌ను, ఎమోషన్లను తారా స్థాయికి తీసుకెళ్ళారు ఆ పార్టీ నేతలు. ఇప్పటివరకూ ఉత్సాహం, ఊపు మీద ఉన్న బీజేపీ నేతలకు అమిత్ షా పర్యటనలో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ.. వారాసిగూడలో ప్లకార్డులతో ప్రదర్శన చేశారు.

రోడ్లమీదకు వచ్చి నిరసన ప్రదర్శనలాగా కాకుండా అమిత్ షా రోడ్‌షో ఎన్నికల ప్రచారంలో అందరికీ దండాలు పెడుతూ ఉంటే, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి నినాదాలు ఇవ్వకుండా కేవలం ‘సేవ్ బీఎస్ఎన్ఎల్… గివ్ 4 జీ’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, చేతులెత్తుతారని ఆశించిన అమిత్ షా ప్లాకార్డులను చూసి ఖంగు తిన్నారు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ లక్షలాది మంది ఉద్యోగుల, కార్మికుల కుటుంబాలను వీధుల్లోకి తెస్తున్నారంటూ అనేక రాజకీయ పార్టీలు విమర్శించాయి. మూడు రోజుల క్రితం సార్వత్రిక సమ్మె కూడా జరిగింది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులను, యూనియన్ల సభ్యులను కలిసి సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపారు. రోడ్లపైన నిరసనలు చేశారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆ ఓట్లు టీఆర్ఎస్‌కు పడతాయో లేదోగానీ అమిత్ షా మాత్రం ఊహించని అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది.

నగరంలోని బీజేపీ శ్రేణులంతా ఉత్సాహంగా ఉన్న సమయంలో.. సాక్షాత్తూ ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు హైదరాబాద్‌లో కూడా ఇలాంటి వ్యతిరేకత ఉందా అని అవాక్కు కావాల్సి వచ్చింది. నగరంలో అనేక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ నిరసన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే ఆందోళన బీజేపీ శ్రేణుల్లో మొదలైంది.

కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి లాంటివారు ప్రచారం చేసినప్పుడు కానరాని వ్యతిరేకత ముగింపు రోజున కనిపించడం విశేషం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగంతో మధ్యతరగతి సెక్షన్ ప్రజల్లో రియలైజేషన్ మొదలైందని భావించాలా లేక కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యోగులు మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారా అనే చర్చలు మొదలయ్యాయి.


Next Story

Most Viewed