'సూక్తులు చెప్పడం కాదు.. ప్రజల ప్రాణాలను ఎలా కాపాడతారో చెప్పండి'

by  |
సూక్తులు చెప్పడం కాదు.. ప్రజల ప్రాణాలను ఎలా కాపాడతారో చెప్పండి
X

న్యూఢిల్లీ : టీవీల ముందుకు వచ్చి సూక్తులు చెప్పడం కాదని.. ప్రజల వద్దకు వెళ్లి వారి ప్రాణాలను ఎలా కాపాడతారో ప్రధాని మోడీ చెప్పాలని కాంగ్రెస్ నాయకురాలు, ఏఐసీసీ సెక్రెటరీ ప్రియాంక గాంధీ అన్నారు. మంగళవారం జాతినుద్దేశించి మోడీ ప్రసంగించిన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బుధవారం ఒక న్యూస్ ఏజెన్సీతో ఆన్ లైన్ వేదికగా ప్రియాంక గాంధీ మాట్లాడారు. ఆమె స్పందిస్తూ.. ఎన్నికల ర్యాలీలలో నిలబడి జోకులు వేయడం కాదని, ప్రధాని ప్రజల ముందుకు వచ్చి వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వారి ప్రాణాలను ఎలా కాపాడతారో ప్రజలకు వివరించాలని అన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారత్.. ఇవాళ ప్రాణ వాయువు కొరతను ఎందుకు ఎదుర్కొంటున్నదని ఆమె ప్రశ్నించారు. కరోనా ఫస్ట్ వేవ్-సెకండ్ వేవ్ మధ్య గ్యాప్ 8 నెలలు వచ్చినా.. సెకండ్ వేవ్ విజృంభించే అవకాశం మెండుగా ఉందని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సీరం సర్వే హెచ్చరించినా, కేంద్రం దానిని పెడచెవిన పెట్టిందని విమర్శించారు.

అంతేగాక వ్యాక్సిన్ పంపిణీలో భారతీయుల ప్రయోజనాల కంటే విదేశాలే ఎక్కువా..? అని ప్రియాంక ప్రశ్నించారు. ‘జనవరి-మార్చి మధ్య 6 కోట్ల వ్యాక్సిన్లను భారత్ నుంచి విదేశాలకు కేంద్ర ప్రభుత్వం ఎగుమతి చేసింది. వాటిని ఇక్కడే వినియోగంలోకి తెచ్చి ఉంటే ఆ మూడు నెలల కాలంలో సుమారు 3 నుంచి 4 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్ పంపిణీ జరిగి ఉండేది. భారతీయులు ఎందుకు మీ ప్రాధాన్యంలో లేరు. ప్రణాళిక లేమి కారణంగానే రెమిడెసివిర్, కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం..’ అని ఆమె మండిపడ్డారు. కేంద్రం కావాలనే టెస్టులను తగ్గించి కేసుల సంఖ్యను తగ్గించి చూపుతుందని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.


Next Story