పేరెంట్స్‌కు కొత్త టెన్షన్.. ‘ప్రైవేటు’ ఫీజుల దోపిడీ

by  |
పేరెంట్స్‌కు కొత్త టెన్షన్.. ‘ప్రైవేటు’ ఫీజుల దోపిడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా సుమారు ఏడాదిగా పాఠశాలలు తెరుచుకోలేదు. ఇటీవలే విద్యాసంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. ఏడాదికి సంబంధించిన ఫీజు మొత్తాన్ని ఒక్కసారిగా చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లు చేస్తున్నారు. వాట్సప్‌లో మెసేజ్‌లు చేస్తున్నారు. ఫీజులను వసూలు చేసే ప్రక్రియలో భాగంగా విద్యార్థులు పాఠశాలలకు తప్పనిసరిగా రావాల్సిందేననే నిబంధన పెడుతున్నారు. పాఠశాలలో పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెబుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ.60 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారని సమాచారం.

ఫిబ్రవరి1 నుంచి 9 ఆపై తరుగతులకు ప్రత్యక్ష బోధన కోసం ప్రభుత్వం అనుమతులిచ్చింది. అనంతరం ఫిబ్రవరి 24 నుంచి 6,7,8 తరగతులకు సైతం ప్రత్యక్ష బోధనకు పర్మిషన్ ఇచ్చింది. ఈ అనుమతులు ఇస్తూనే విద్యార్థులు ఇష్టప్రకారమే పాఠశాలకు హాజరుకావచ్చునని లేకపోతే గతంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లో పాఠాలు వినొచ్చనే వెసులుబాటు కల్పించింది. పాఠశాలకు పిల్లలను పంపించడం ఇష్టం లేని తల్లిదండ్రులు ఆన్‌లైన్ ద్వారానే తరగతులకు హాజరవుతారని పాఠశాలల యాజమాన్యాలకు తెలియ జేస్తున్నారు. అన్ని ప్రైవేటు పాఠశాలల్లో దాదాపుగా 60 నుంచి 70శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారానే పాఠాలు వింటున్నారు. కానీ, ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నాయి.

తప్పని సరిగా పాఠశాలకు రావాలనే షరతులు పెడుతున్నాయి. వారు పాఠశాలకు వస్తే ఫీజులు వసూలు చేయవచ్చన్న ఉద్దేశంతో పావులు కదుపుతున్నాయి. పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందిస్తున్నాయి. ఫీజు వసూలు చేసేందుకు యాజమాన్యాలు ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష తేదీలను నిర్ణయించి షెడ్యూల్‌ను విడుదల చేస్తున్నాయి. ఏడాది ఫీజు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థల్లో తరగతులకు హాజరవుతున్న విద్యార్థులతో హాజరుకాని విద్యార్థులకు ఫోన్లు చేయిస్తున్నారు. సిలబస్ మొత్తం పూర్తవుతుందని వారితో చెప్పిస్తున్నారు. దీంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు.

Next Story

Most Viewed