హైదరాబాద్‌లో అతిపెద్ద సోలార్ ప్లాంటు ప్రారంభం

by  |
హైదరాబాద్‌లో అతిపెద్ద సోలార్ ప్లాంటు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ సోలార్ పీవీ సేల్స్ అండ్ మాడ్యూల్స్ తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ హైదరాబాద్‌లో తన కొత్త ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించింది. రూ. 483 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంటును కంపెనీ నిర్మించింది. 1.5 గిగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ సెల్, మాడ్యూల్స్ తయారీని ఈ ప్లాంటులో చేపట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇందులో 750 మెగావాట్ల సోలార్ సెల్స్, 750 మెగావాట్ల మాడ్యూల్స్ తయారీ సామర్థ్యంతో కంపెనీ కార్యకలాపాలు నిర్వహించనుంది. అధునాతన మల్టీక్రిస్టలీన్‌, మోనో పీఈఆర్‌సీ టెక్నాలజీని ఈ యూనిట్‌లో ఉపయోగించనున్నారు.

ప్రీమియర్ ఎనర్జీస్ ఈ కొత్త ప్లాంట్ సోలార్ సెల్స్, మాడ్యూళ్ల ఉత్పత్తిలో దక్షిణ భారత్‌లో అతిపెద్దది, దేశంలోనే రెండో అతిపెద్ద ప్లాంట్ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త ప్లాంటును తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి మంత్రి కెటి రామారావు అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుత ఈ ప్లాంటులో మొత్తం 700 మంది పనిచేస్తున్నారని, త్వరలో ఈ ప్లాంటును రూ. 1,200 కోట్లకు విస్తరించి, 2000 మందికి ఉపాధిని కల్పించనున్నట్టు కంపెనీ వివరించింది.

“భారత్‌లో విద్యుత్ పరిశ్రమ భవిష్యత్తు పునరుత్పాదక శక్తి ద్వారా కొనసాగుతుంది. ప్రధానంగా సోలార్ విద్యుత్ గణనీయంగా వృద్ధి సాధిస్తుంది. కొత్త ప్లాంటు ద్వారా ప్రీమియర్ ఎనర్జీస్ సామర్థ్యాన్ని విస్తరించడం ద్వారా మరింత నిబంధత, కొత్త లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తున్నాం. భారత విద్యుత్ రంగంలో గ్రీన్ ఎనర్జీని మరింత పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని” ప్రీమియర్‌ ఎనర్జీస్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిరంజీవ్‌ సలుజా చెప్పారు. కాగా, ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ 1995లో సురేందర్ పాల్ సింగ్ స్థాపించారు. సోలార్ సంబంధిత పరికరాలు తయారీ ద్వారా భారత్‌లోని సంస్థలతో పాటు 30 దేశాలను ఎగుమతులు నిర్వహిస్తోంది.


Next Story