ఫామ్‌లోకి విజయసాయిరెడ్డి

by Dishafeatures2 |
ఫామ్‌లోకి విజయసాయిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజకీయాల్లోనే కాదు అన్ని రంగాల్లో నమ్మకస్తులు, నమ్మిన బంటులు తప్పనిసరి. వీళ్లు చేయాల్సిన పని ఏంటంటే అధినేత ఏది శాసిస్తే అది పూర్తి చేయడం. అధినేత ఆదేశాలను శిరస్సా వహించి ఆచరణలో పెట్టడం. అలాగే పార్టీలో అయితే తెరవెనుక ఉంటే అన్నీ చక్కదిద్దాలి. పార్టీ అంతర్గత విషయాలను ఎప్పటికప్పుడు చక్కదిద్ది ఎలాంటి గందరగోళానికి తావివ్వకూడదు. అధినేతతో అధికారాన్ని పంచుకోవడానికే కాదు అవసరమైతే కారాగారానికి వెళ్లడానికైనా సిద్ధపడాలి. ఇలాంటి అంశంపై ఏపీ రాజకీయాల్లో చర్చకు వస్తే వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలే గుర్తుకువస్తారు. వైఎస్ జగన్‌కి నమ్మినబంటు ఎంపీ విజయసాయిరెడ్డి అని అంటూ ఉంటారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో ఇప్పుడు వైఎస్ జగన్‌కు విజయసాయిరెడ్డి అలా అన్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు వైఎస్ జగన్ తర్వాత వైసీపీలో నెంబర్ 2 అంటూ ప్రచారం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నీ తానైన విజయసాయిరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లకు సైలెంట్ అయిపోయారు.

ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి అటు పార్టీలోనూ ఇటు పాలనా వ్యవహారాల్లో వేలు పెట్టడంతో విజయసాయిరెడ్డిని సీఎం జగన్ పక్కన పెట్టేశారని ప్రచారం జరిగింది. దీంతో విజయసాయిరెడ్డి దాదాపు ఏడాదిపాటు సైలెంట్‌గా ఉన్నారు. అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఫామ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ గెలుపొందడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి అవసరాన్ని గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ఆయనను మళ్లీ యాక్టివ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఇక విజయసాయిరెడ్డి అటు పార్టీ, పాలనా వ్యవహారాల్లో మరింత యాక్టివ్ అవుతారని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

నెంబర్ టూ నుంచి కిందకి

విజయసాయిరెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు జాతీయస్థాయిలోనూ రాజకీయ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీలో నంబర్-2గా ఓ వెలుగు వెలుగొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా సీఎం వైఎస్ జగన్ ఆదేశిస్తే చాలు దాన్ని తూచ తప్పకుండా ఆచరణలో పెట్టే అత్యంత విశ్వాసపాత్రుడు విజయసాయిరెడ్డి. వైఎస్ జగన్‌ను ఎవరు కలవాలి... జగన్ ఎవరిని కలవాలి.. టికెట్లు ఎవరికి ఇవ్వాలి, పదవులు ఎవరికి అప్పగించాలి ఇవన్నీ విజయసాయిరెడ్డితో చర్చించనిదే వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకునేవారు కాదట. అధినేత తనపై ఉంచిన నమ్మకంతో విజయసాయిరెడ్డి సైతం అన్నీ తానై వ్యవహరించారు. వైసీపీలో చేరికలు, ఇతరత్రా వాటిపై ఫోకస్ పెట్టారు. 2019 ఎన్నికల్లో పీకేటీంతో పోటీపడి మరీ గ్రౌండ్ వర్క్ చేశారు.

పార్టీ అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం వైసీపీ పార్లమెంటరీ నేతగా, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించారు. గతమెంతో ఘనం అన్నట్లు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. నంబర్-2 గా ఉన్న ఆయన పరిస్థితి పార్టీలో దారుణంగా పడిపోయింది. ఉత్తరాంధ్ర బాధ్యతలు సీఎం జగన్ తన సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు. అంతేకాదు వైసీపీలో అత్యంత కీలకంగా ఉన్న సోషల్ మీడియా వింగ్ కూడా విజయసాయిరెడ్డి చేతుల్లో నుంచి తప్పించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి అప్పగించారు. ఇలా ఒకేసారి అటు ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి పదవి, ఇటు సోషల్ మీడియా విభాగం రెండు పదవులు కోల్పోయారు.

పదవుల నియామకాల్లోనూ సంప్రదింపుల్లేవ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. ఈ వ్యవహారాలలో విజయసాయిరెడ్డిని అంతగా ఇన్‌వాల్వ్ చేయలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రీజనల్ కో ఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకలు ఇలా అనేక పదవులు సృష్టించినప్పటికీ వాటి నియామకాల్లో కూడా విజయసాయిరెడ్డిని అంతగా సంప్రదించిన పాపాన పోలేదనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అంతేకాదు విజయసాయిరెడ్డి అధ్యక్షుడిగా ఉండే అనుబంధ సంఘాలకు బాధ్యులను అధిష్టానం నియమించింది. విజయసాయిరెడ్డి స్థానంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో లిస్టులు విడుదలయ్యాయి. అంతేకాదు 13 జిల్లాల్లో యువజన, మహిళా, రైతు, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, వైద్య, క్రిస్టియన్, మైనార్టీ, వాణిజ్య, స్టూడెంట్ విభాగాలకు అన్నింటికీ అధ్యక్షులను నియామకాలు సైతం జరిగాయి. వీటి నియామకాల్లో విజయసాయిరెడ్డి ప్రమేయం ఏమాత్రం లేదనే ప్రచారం ఇప్పటికీ ఉంది. రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మారారు.

వైఎస్ జగన్ తన మీద ఉంచిన నమ్మకాన్ని తూచ తప్పకుండా నిలబెట్టుకునేవారు విజయసాయిరెడ్డి. జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి సైతం జైలుకెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తికి వరుస పరాభవాలు ఎదురవ్వడం అప్పట్లో రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇకపోతే నందమూరి తారకరత్న మరణం అనంతరం నందమూరి ఫ్యామిలీతో విజయసాయిరెడ్డి కలిసిపోయారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణలతోపాటు నటులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ఇతర కుటుంబ సభ్యులతో మమేకం అయ్యారు. ఒకానొక సందర్భంలో ఈ బంధమే విజయసాయిరెడ్డిని వైసీపీలో ఒంటరిని చేశాయనే ప్రచారం కూడా జరిగింది.

ఇక దూకుడే

ఏడాది కాలంగా ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీలో సైలెంట్‌గా ఉంటున్నారనే ప్రచారం వైసీపీలోనే ఉంది. విజయసాయిరెడ్డిని సీఎం జగన్ పక్కన పెట్టి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి పూర్తి అధికారం ఇచ్చారనే ప్రచారం ఉంది. అంతేకాదు వైసీపీలో నెంబర్ 2 స్థానం నుంచి విజయసాయిరెడ్డిని తప్పించారనే ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు విజయసాయిరెడ్డి పవర్స్‌ను సైతం కట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతా విజయసాయిరెడ్డి పనైపోయిందని అంతా భావించారు. అటు పార్టీలోనూ... ఇటు పాలనలోనూ జరుగుతున్న గందరగోళంపై సీఎం వైఎస్ జగన్ ఫోకస్ పెట్టగా విజయసాయిరెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపించిందని తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను సమర్ధవంతంగా చక్కబెట్టడంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫెయిల్ అయ్యారని సీఎం జగన్ ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి దూరం అవుతున్న ప్రతీ నాయకుడు, కార్యకర్త మెుదట ఆరోపణలు చేసేది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనే.

అటు అసమ్మతి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలాంటి వాళ్లు కూడా సజ్జలపైనే ఆరోపణలు చేశారు. ఇకపోతే వైఎస్ జగన్‌ సమీప బంధువు, అత్యంత సన్నిహితుడు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సరిగ్గా స్పందించలేదనే ప్రచారం సైతం ఉంది. సజ్జల స్పందించి ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా ఎదుట కంటతడి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదని పార్టీలోనూ చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ పార్టీ అంతర్గత వ్యవహారాలను విజయసాయిరెడ్డికి అప్పగించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేని నేపథ్యంలో విజయసాయిరెడ్డిని మళ్లీ యాక్టివ్ చేస్తే పార్టీలో అంతర్గత సమస్యలను విజయసాయిరెడ్డి చక్కదిద్దుతారని సీఎం జగన్ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయి రెడ్డిని నియమించినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed