నేడు సీబీఐ ముందుకు టీవీకే అధినేత విజయ్

by Thanuru Gopichand |

రసవత్తరంగా మారిన రాజకీయ ముఖచిత్రం.

నేడు సీబీఐ ముందుకు టీవీకే అధినేత విజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : ​తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట (Karur Stamphede) కేసు విచారణలో భాగంగా తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడైన ప్రముఖ నటుడు విజయ్ నేడు ఢిల్లీలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారుల ముందు హాజరుకానున్నారు. 2025 సెప్టెంబర్ 27న కరూర్ జిల్లాలో టీవీకే పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘోర దుర్ఘటనపై విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. దీంతో దర్యాప్తు సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 179 కింద విజయ్‌కు జనవరి 6న నోటీసులు జారీ చేసిన సీబీఐ, విచారణ నిమిత్తం నేడు తమ కార్యాలయానికి రావాలని విజయ్ ను ఆదేశించింది. దీనికోసం విజయ్ చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.

​ఈ కేసులో విజయ్ అపరాధిగా కాకుండా, పార్టీ బాధ్యుడిగా, ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న కీలక వ్యక్తిగా విచారణను ఎదుర్కోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐ అధికారులు పలువురు టీవీకే ముఖ్య నాయకులను, విజయ్ కారు డ్రైవర్‌ను ప్రశ్నించారు. తమిళనాడు ప్రభుత్వం ఈ కేసులో సీబీఐ దర్యాప్తును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యాల వల్లే ఈ ఘోరం జరిగిందని టీవీకే నాయకులు వాదిస్తుండగా, ప్రభుత్వం మాత్రం పార్టీ నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతోంది. విజయ్ సీబీఐ విచారణకు హాజరవుతుండటంతో అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణ ద్వారా తొక్కిసలాటకు దారితీసిన అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story