వచ్చే నెలలో అమెరికాకు ప్రధాని మోడీ.. ట్రంప్‌తో కీలక భేటీ!

by Yella Dhawani Reddy |

ప్రధాని మోడీ (PM Modi) ఫిబ్రవరిలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెలలో అమెరికాకు ప్రధాని మోడీ.. ట్రంప్‌తో కీలక భేటీ!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ (PM Modi) ఫిబ్రవరిలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో (డోనాల్డ్ Trump) ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలో భారత ప్రధాని మోడీ (Modi Likely to Visit US) వైట్ హౌస్‌కు రావచ్చునని వెల్లడించారు.

భారత్, అమెరికా దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో మోడీ, ట్రంప్‌ మధ్య ఉన్న స్నేహబంధం కీలకపాత్ర పోషించనుంది. ఈ భేటీలో చైనా దూకుడును అడ్డుకోవడంపై నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మతః పౌరసత్వం రద్దు, H-1B వీసా తదితర అంశాలను మోడీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. అలాగే అమెరికా వస్తువులపై భారత్‌ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్‌ ఈ అంశాన్ని మోడీతో చర్చించే అవకాశముంది. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్‌ ముందుంచాలని మోడీ భావిస్తున్నట్లు సమాచారం.

తొలిసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ట్రంప్ తన చివరి విదేశీ పర్యటన భారత్‌లోనే చేపట్టారు. 2020లో అహ్మదాబాద్‌కు విచ్చేసి మోడీతో కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు 2019 సెప్టెంబరులో వీరిద్దరూ హ్యూస్టన్‌లోని ర్యాలీలో ప్రసంగించారు.

Next Story