- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీ కులాన్ని ఓబీసీలో ఎప్పుడు చేర్చారు?.. అసలు ఈ వివాదేమేంటీ?
తెలంగాణలో ఇటు ఎస్సీ వర్గీకరణ, అటు బీసీ రిజర్వేషన్‌లు కేంద్రంగా రాజకీయం జరుగుతున్నది.

దిశ, నేషనల్ బ్యూరో: తెలంగాణలో ఇటు ఎస్సీ వర్గీకరణ, అటు బీసీ రిజర్వేషన్‌లు కేంద్రంగా రాజకీయం జరుగుతున్నది. ఈ చర్చ హీటెక్కిన నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసలు బీసీనే కాదని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఈ ఆరోపణ పాతదే అయినా.. మరోసారి చర్చనీయాంశమైంది. ఇంతకీ ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కాదా? లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటే ఏమిటీ? మోడీ కమ్యూనిటీని ఎప్పుడు ఓబీసీలో చేర్చారు? ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఈ పని జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానాలను పరిశీలిద్దాం.
ఓబీసీలో ఎప్పుడు చేర్చారు?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తెలి ఉపకులాల్లో ఒకటైన మోద్ ఘాంచికి చెందినవారు. ఈ కులానికి చెందినవారు వంట నూనెలు తీయడం, వ్యాపారం చేయడం వంటి కార్యకలాపాలు చేస్తుంటారు. ఈ మోద్ ఘాంచి కులాన్ని ఏప్రిల్ 4, 2000లో ఓబీసీలో చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మోద్ ఘాంచితోపాటు తెలి సాహు, తెలి రాథోడ్, తెలి రాథోర్ ఉప కులాలను ఓబీసీలో 23వ ఎంట్రీలో పేర్కొంది. దీంతో అధికారికంగా గుజరాత్‌కు సంబంధించి కేంద్ర ఓబీసీ జాబితాలో మోధ్ ఘాంచి కులం చేరింది. అంటే మోదీ కులం ఓబీసీలో చేరినట్టయింది.
మోడీ ప్రమేయం ఏమిటీ?
ఏప్రిల్ 4, 2000లో గెజిట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. ఆయన మరుసటి ఏడాది అక్టోబర్ 7న సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ, గుజరాత్‌లో అప్పటికే నరేంద్ర మోడీ ముగ్గురు టాప్ లీడర్‌లలో ఒకరిగా ఎదిగారు. గుజరాత్ బీజేపీ చీఫ్‌లుగా చేసిన కేశుబాయ్ పటేల్, శంకర్‌సిన్హ్ వాఘేలా తర్వాత కీలక నాయకుడిగా మోడీనే ఉన్నారు. 2000 గెజిట్ విడుదలైనప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. 1999 నుంచి 2004 వరకు అటల్ బిహారి వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే ఉన్నది. రాష్ట్రంలోనూ కేశుబాయ్ పటేల్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. కేశుబాయ్ పటేల్ అర్ధాంతర రాజీనామా తర్వాత మోడీకి సీఎం అవ కాశం వచ్చింది. కేశుబాయ్ అగ్రవర్ణానికి చెందిన నాయకుడు కాబట్టి కౌంటర్‌గా బీసీ నాయకుడిని ప్రొజెక్ట్ చేయాలనే ఆలోచనల్లో భాగంగానే ఈ మార్పులు జరిగాయనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. బలమైన హిందుత్వ నాయకుడిగా పేరున్న మోడీకి ఆయన కులాన్ని అంతే బలంగా ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం రాలేదనే విశ్లేషణలూ వచ్చాయి.
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
దేశవ్యాప్త కుల గణనకు పట్టుబడుతున్న రాహుల్ గాంధీ పలుమార్లు ప్రధాని మోడీపై ఈ ఆరోపణలు చేశారు. నరేంద్ర మోడీ ఓబీసీలో జన్మించలేదని, ఆయన జన్మత: జనరల్ కేటగిరీ కాబట్టి కుల గణనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కానీ, ఈ ఆరోపణలను బీజేపీ ఎప్పటికప్పుడు కొట్టేసింది. మోద్ ఘాంచిని ఓబీసీలో చేర్చడంలో ప్రధాని మోడీ ప్రమేయం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ సారి స్పష్టత ఇచ్చారు. 1994లోనే గుజరాత్‌లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే మోద్ ఘాంచి కులాన్ని ఓబీసీలో చేర్చిందని, గుజరాత్ ప్రభుత్వ సిఫారసు మేరకే 2000లో కేంద్రం ఓబీసీలో ఆ కులాన్ని చేర్చిందని వివరించారు.






