వారి నమ్మకాన్ని పొగొట్టుకుంటున్న సీఎం కేసీఆర్?

by Disha Web Desk 2 |
వారి నమ్మకాన్ని పొగొట్టుకుంటున్న సీఎం కేసీఆర్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని ఢీ కొట్టేందుకు బలమైన ప్రతిపక్ష కూటమిగా ఏర్పాటు కావాలని భావిస్తున్న నాన్ బీజేపీ కూటమికి ఆదిలోనే ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఈ కూటమికి కీలక నేతలు అంటి ముట్టనట్లుగా వ్యవహరించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర రచ్చ జరుగుతున్నది. ఆదివారం మాజీ ఉప ప్రధాని దేవీలాల్ 109 జయంతిని పురస్కరించుకుని హర్యానాలోని ఫతేహాబాద్‌లో ఐఎన్ఎల్డీ నిర్వహించిన ర్యాలీలో మరోసారి విపక్షాల ఐక్యత తేలిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో కీలకంగా అవుతారని భావిస్తున్న పశ్చిమ బెంగాల్, తెలంగాణ ముఖ్య మంత్రులు మమతా బెనర్జీ, కేసీఆర్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాశంగా మారింది. ఈ పరిణామంతో 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలన్న వ్యూహం ఏ అంచును చేరుతుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కీలక మీటింగ్‌కు మమతా, కేసీఆర్ డుమ్మా:

ఈ మీటింగ్‌కు దేశవ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతలకు ఆహ్వానాలు అందాయి. ప్రతిపక్షాల ఐక్యత చాటేందుకు ఈ ర్యాలీ ఓ ముఖ్యమైన వేదికగా మారుతుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే ఈ కార్యక్రమానికి అనేక మంది నేతలు హాజరైనా మమతా బెనర్జీ, కేసీఆర్ హాజరు కాకపోవడంపైనే అందరి దృష్టి పడినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల వ్యవహార శైలి ఇప్పుడు ప్రతిపక్షాలను అనుమానించేలా చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ మీటింగ్‌కు హాజరైన నేతలు.. కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా ప్రతిపక్షాల ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదనే విషయాన్ని పదే పదే చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి మమతా, కేసీఆర్‌కు ఇష్టం లేదని ఈ కారణం చేతనే వీళ్లు డుమ్మా కొట్టాల్సి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ మీటింగ్‌కు రాలేని వీరు భవిష్యత్‌లోనూ ఇదే వైఖరి అనుసరిస్తారనే చర్చ జరుగుతోంది.

త్రిశంకు స్వర్గంలో విపక్షాలు:

వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలు గట్టి ప్రయత్నమే చేస్తునప్పటికీ ఆ పార్టీల వ్యవహార శైలిపై అనేక మందికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీపై పోరాటం విషయంలో తామంతా ఏకతాటిపై ఉన్నామనే భ్రమల్లో కొన్ని పార్టీలు కొనసాగుతున్నాయని వాస్తవానికి అలాంటి పరిస్థితులు విపక్ష కూటమిలో కనిపించడం లేదనే టాక్ ఉంది. ప్రస్తుతం తామున్న పరిస్థితియే విపక్షాల మధ్య ఐక్యత అనుకుంటే మాత్రం ఇది కచ్చితంగా త్రిశంకు స్వర్గం లాంటిదేనని, వీలైనంత త్వరగా నేల మీదకు వచ్చి వాస్తవాలను అన్వయించుకోకుంటే తప్ప బీజేపీపై ప్రతిపక్షాల పోరాటాలు నిలువలేవనే టాక్ వినిపిస్తున్నది. బీజేపీపై ఒంటికాలితో పైకి లేస్తున్న కేసీఆర్, మమతలు అసలైన సమయంలో హ్యాండిస్తున్నారనేది విపక్ష కూటమిలోని పార్టీల విమర్శలు. అయితే వీరు ఇలా చేయడం వెనుక రాజకీయంగా బలమైన కారణం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది.

రాజకీయ అవసరం వేరు అవకాశం వేరు!:

రాజకీయాల్లో పరిస్థితులు ఉండవని పరిణామాలే ఉంటాయనేది ఓ వాదన. అలాగే శాశ్వత శతృత్వం అనే రూల్ రాజకీయాలకు అస్సలు సూట్ కాని పదం. నిజానికి ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు బీజేపీపై పోరాటం చేయక తప్పని అవసరం ఉంది. ఎందుకంటే ఆ పార్టీల విషయంలో బీజేపీ అనుసరించిన వైఖరి, లేదా ఇతర కారణాలో కమలం పార్టీపై కసితో ఉన్నాయి. తమ పార్టీ మనుగడ సాధించాలంటే బీజేపీపై పోరాటం చేయల్సిన అవసరం ఆ పార్టీలకు ఏర్పడగా టీఎంసీ, టీఆర్ఎస్ విషయంలో అలాంటి ఖచ్చితమైన ఉద్దేశం అంటూ ఏది లేదనే టాక్ వినిపిస్తోంది. కేవలం రాజకీయ అవకాశమే తప్ప మరో ఉద్దేశమేమీ లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే కేసీఆర్, మమతను ప్రతిపక్షాలు ఏ మేరకు విశ్వసిస్తారనేది అనుమానమే అనే టాక్ వినిపిస్తోంది. ఈ ముఖ్యమైన ఐఎన్ఎల్డీ సమావేశానికి గైర్హాజరు అయిన కేసీఆర్, మమతలను ప్రతిపక్ష నేతలు ఇకపై కూడా విశ్వసిస్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.


Next Story

Most Viewed