టీడీపీ శ్రేణుల్లో ‘జోష్’.. యువగళానికి విశేష స్పందన

by Dishafeatures2 |
టీడీపీ శ్రేణుల్లో ‘జోష్’.. యువగళానికి విశేష స్పందన
X

దిశ, కర్నూలు ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో టీడీపీ శ్రేణుల్లో జోష్ మొదలైంది. ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఎమ్మెల్యేలు పట్టం కట్టి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను చాటారు. దీంతో పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. అదే క్రమంలో యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అలాగే రేపు సీమ ముఖ ద్వారమైన కర్నూలులో ఈ యాత్రతో లోకేష్ అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు, ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఏర్పాట్ల పనిలో నిమగ్నమై జిల్లాలోకి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే బహిరంగ సభలు, సమావేశాలు ఎక్కడెక్కడనే విషయంపై కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ విషయాలన్నీ నేడు కమిటీ, రెండు జిల్లాల అధ్యక్షులు ప్రకటించనున్నారు. గతంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల 13న అంటే రేపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు వాటికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రభుత్వ వ్యతిరేకతను బట్టబయలు చేసేలా ఓటర్లు టీడీపీకి పట్టం కట్టారు. పట్టభద్రులతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పంచుమర్తి అనురాధకు మంచి విజయాన్ని అందించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరు పట్ల తమ వ్యతిరేకతను ఓటు ద్వారా చూపించారు. ఇలా వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అనేక శాఖలకు సంబంధించి చేసిన వాగ్ధానాలు అమలు చేయడంలో జగన్ విఫలమ య్యారు. అలాగే సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసి సర్వే కూడా చేయించారు. అలాగే నియోజకవర్గాలతో పాటు రాష్ర్టంలో ఎక్కడా చూడా ఎలాంటి శాశ్వతమైన అభివృద్ధి పనులు చేపట్టలేదు.

జాబ్ క్యాలెండర్ వదలలేదు. కరోనా కష్టకాలంలో ప్రాణాలర్పించి విధులు నిర్వహించి కరోనాతో పోరాడి మృత్యు ఒడి చేరిన కుటుంబాలకు ఎలాంటి భరోసా కల్పించలేదు. పైగా ఆ కుటుంబాల్లో ఎలాంటి కారుణ్య నియామకాలు చేపట్టలేదు. ఫలితంగా అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సంక్షేమ పథకాల్లో కోత, నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్ తదితర వంటి వాటి ధరలు విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. మద్యపాన నిషేధం మాట ఊసే మరిచారు. ఇలా అనేక విధాలుగా రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి ప్రజలపై భారాలు పెంచారని, ఇకనైనా మేల్కోవాలని, ప్రజలను చైతన్యం చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రానున్న ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు అధికారం చేజిక్కించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు లోకేష్ తో యువగళంలో పాలు పంచుకుంటున్నారు.

ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలలో పర్యటించేలా పాదయాత్ర నిర్వహణ కమిటీ రాబీన్ శర్మ టీమ్ సభ్యులు అన్ని నియోజకర్గ ఇంచార్జిలతో కలిసి కసరత్తు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు రోజులుండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. లోకేష్ బస, బహిరంగ సభలు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే విషయాలను చర్చిస్తున్నారు. ఇప్పటికే నిర్వహణ కమిటీ సభ్యులు డోన్, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర జరిగే గ్రామాలు, రాత్రి బస చేసే ప్రదేశాలు, సభ నిర్వహణపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నేడు వీటికి సంబంధించిన రూట్ మ్యాప్ ను రెండు జిల్లాల అధ్యక్షులు గౌరు వెంకట రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రకటించే అవకాశం ఉంది.

పాదయాత్ర సాగే తీరు

అనంతపురం జిల్లాలోని రాయలచెరువు మీదుగా ఈ నెల 13న నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం వద్ద లోకేష్ అడుగు పెట్టనున్నారు. అక్కడి నుంచి నల్లమేకలపల్లి, జక్కసాని కుంట్ల, పీఆర్ పల్లి, గుడిపాడు, మాందొడ్డి, హెచార్ పల్లి మీదుగా ప్యాపిలి చేరుకుంటారు. అనంతరం కలచట్ల, ఎస్ రంగాపురం మీదుగా తుగ్గలి మండలం శభాషపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలో ఆడుగు పెడతారు. రామలింగాయపల్లి క్రాస్, రాంపల్లి, ఆర్ఎస్ పెండేకల్లు, మారెల్ల, నల్లగుంట్ల మీదుగా ఎన్కో కొట్టాల వద్ద ఆలూరు నియోజక వర్గం దేవనకొండ మండలంలోకి చేరుకుంటారు. అక్కడి నుంచి గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బైరవాన్ కుంట, పలదొడ్డి, కె.వెంకటాపురం, గద్దెరాళ్ల మీదుగా మండలం కేంద్రం దేవనకొండకు చేకుంటారు. అక్కడి నుంచి ఆలారుదిన్నె బిడ్జీ, పుప్పాలదొడ్డి, కైరుప్పల, కారుమంచి, ములుగుందం మీదుగా ఆదోని నియోజకవర్గంలోని పెద్దపెండేకల్లుకు చేరుకుంటారు.

ఆ నియోజకవర్గంలో ఆరేకల్లు, ఎస్.నాగులాపురం, కపటి మీదుగా పెద్దకడబూరు మండలం రంగాపురం వద్ద మంత్రాలయం నియోజకవర్గంలో అడుగు పెడతారు. మంత్రాలయం నియోజకవర్గంలో పెద్దకడబూరు మండలం తరువాత నందవరం మండలం బాపురం వద్ద ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అడుగు పెడతారు. హాలహారా ధర్మాపురం, ముగతి క్రాస్ నుంచి ఎమ్మిగనూరు పట్టణం చేరుకుంటారు. అక్కడి నుంచి గోనెగండ్ల మండలం మీదుగా కోడుమూరు నియోజకవర్గంలోకి చేరుకొని గూడూరు, కర్నూలు రూరల్, కల్లూరు మండలాల్లో పాదయాత్ర సాగిస్తారు. అనంతరం కర్నూలు నగరంలో లోకేష్ పాదయాత్ర సాగిస్తారు. అక్కడితో కర్నూలు జిల్లాలో పాదయాత్ర ముగుస్తుంది.

నంద్యాల జిల్లాలో..

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు మీదుగా ఆత్మకూరు నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెలుగోడు, బండిఆత్మకూరు మీదుగా నంద్యాల చేరుకునే అవకాశం ఉంది. అలా కాకుండా నందికొట్కూరు, గడివేముల మీదుగా బండి ఆత్మకూరు చేరుకొని అక్కడి నుంచి నంద్యాల చేరుకునే అవకాశం ఉంది. రెండు మార్గాల్లో ఒక దానిని పాదయాత్ర కమిటీ ఓకే చేసే అవకాశం ఉంది. అయితే శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే ఆత్మకూరు పట్టణం మీదుగా పాదయాత్ర సాగించాలని పట్టు బట్టినట్లు సమాచారం. ఆత్మకూరు మీదుగా పాదయాత్రను ఖరారు చేస్తే నందికొట్కూరు నుంచి జూపాడుబంగ్లా, పాములపాడు మీదుగా శ్రీశైలం నియోజకర్గ కేంద్రమైన ఆత్మకూరు చేరుకుంటారు. అక్కడి నుంచి వెలుగోడు మీదుగా బండిఆత్మకూరు మీదుగా నంద్యాల చేరుకుంటారు. నంద్యాల పట్టణం నుంచి గోస్పాడు మండలం నుంచి బనగానపల్లె నియోజకవర్గంలో అడుగు పెడతారు. బనగానపల్లె, కొవెలకుంట్ల మండలాల మీదుగా దొర్నిపాడు మండలం మీదుగా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చేరుకుంటారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల మీదుగా కడప జిల్లాలో అడుగు పెడతారు. ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 35 రోజులు లోకేష్ పాదయాత్ర ఉండే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేడు ప్రకటించనున్నారు.

Also Read..

జనసేన పార్టీ ఎందుకో పవన్‌కే తెలీదు.. మంత్రి అంబటి రాంబాబు

Next Story

Most Viewed