బీజేపీ మాస్టర్ ప్లాన్.. సూపర్ స్టార్‌ రజినీకాంత్‌‌కు గవర్నర్ పదవి?

by Disha Web Desk |
బీజేపీ మాస్టర్ ప్లాన్.. సూపర్ స్టార్‌ రజినీకాంత్‌‌కు గవర్నర్ పదవి?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నలుగురు ప్రముఖులను రాజ్యసభకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌, సంగీత దర్శకుడు ఇళయరాజా, మాజీ అథ్లెట్‌ పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్‌ చేస్తునట్టు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. తాజాగా.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. మూడు దశాబ్దాల పాటు తమిళ చిత్ర పరిశ్రమను ఏలిన రజనీకాంత్‌కు అశేష ప్రజల ఆదరణ ఉంది. దీంతో ఆయన్ను బీజేపీలోకి చేర్చుకోవాలని అగ్రనేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకోసం తలైవాకు గవర్నర్‌ పదవిని ఎర వేస్తున్నట్లు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. రజనీ ఇటీవల హడావుడిగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ఆ వెంటనే అనూహ్యంగా తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌తో తాను రాజకీయాలు చర్చించిన విషయం నిజమేనని, అయితే వాటి గురించి చెప్పనని నిక్కచ్చిగా తెలిపారు. ఇకపోతే రజనీకాంత్‌ గురించి గత కొద్దికాలంగా ఢిల్లీ బీజేపీ ప్రముఖ నేతలలో పెద్ద చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కాగా, పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలనుకున్న రజినీకి ఆరోగ్యం సహకరించకపోవడం మూలంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో అక్కడితో ఈయన రాజకీయ కథ ముగిసిందని అందరూ అనుకుంటున్న తరుణంలో బీజేపీ ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వబోతోంది అని ప్రచారం తెరపైకి రావడంతో తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ రజనీకాంత్‌పై సానుకూలంగా ఉంటే అమిత్‌షా వ్యతిరేకిస్తున్నట్లు టాక్‌. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి : 'అక్కడ ఏం చేయాలన్నా మోడీ పర్మిషన్ ఉండాల్సిందే': సుబ్రమణ్యస్వామి


Next Story