తాడిపత్రిలో రాజకీయ పోరు.. జేసీ వర్సెస్ పెద్దారెడ్డి

by  |
తాడిపత్రిలో రాజకీయ పోరు.. జేసీ వర్సెస్ పెద్దారెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిల మధ్య పొలిటికల్ వార్ తారా స్థాయికి చేరింది. నువ్వెంతంటే నువ్వెంత అంటూ ఒకరినొకరు యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రస్తుతం పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ చైర్మన్ అవ్వకుండా ఉండేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదు. అప్పటి నుంచి ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా తాడిపత్రి ఆర్డీటీ కాలనీలోని ఇళ్ల స్థలాల విషయంలో నేతల మధ్య కోల్డ్ వార్ పీక్‌కి చేరింది. ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతిసవాళ్లతో విరుచుకుపడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తాడిపత్రి ఆర్డీటీ కాలనీలోని మున్సిపల్ స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవలే మున్సిపల్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేతకు మార్కింగ్‌ కూడా చేశారు. అయితే కూల్చివేత మార్కింగ్‌లో టీడీపీకి మద్దతుగా నిలిచిన సీపీఐ కౌన్సిలర్ కూడా ఉన్నారు. ఈ విషయంపై మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి కౌన్సిలర్లను వేధించడం సరికాదని హెచ్చరించారు. ‘గత 30 ఏళ్లుగా వారంతా ఇక్కడ ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని, నీకు కౌన్సిలర్‌ కావాలంటే నేనే మీ పార్టీలోకి పంపిస్తాను అంతేకానీ ఇలా వేధించొద్దు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఇళ్లను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అవసరమైతే మంగళవారం బాధితుల కోసం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని జేసీ ప్రకటించారు. తనను మున్సిపల్‌ చైర్మన్‌ పదవి నుంచి దింపాలని చూస్తున్నారని, అయినప్పటికీ ఇంకా మూడు సంవత్సరాల ఆరు నెలలు తాను పదవిలో కొనసాగుతానని జేసీ ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి దమ్ముంటే, అతను మగాడైతే..తాడిపత్రిలో 30 ఏళ్ల రాజకీయాలు చేసిన వ్యక్తే అయితే ఆక్రమించుకున్న 80మంది పేర్లను కమిషనర్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను కూడా అక్రమంగా కాంప్లెక్స్‌లు ఎవరు కట్టారో లిస్ట్ ఇస్తానన్నారు. తాడిపత్రిలో జేసీ అనుచరులు ఆక్రమణలు చేసినట్లు పెద్దారెడ్డి ఆరోపించారు. దళితుల భూముల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టారని ఆరోపించారు. చివరకు డ్రైనేజీలను కూడా వదల్లేదన్నారు. డ్రైనేజీలపై పిల్లర్లు వేసి భవనాలు నిర్మించి అన్నీ ఆక్రమించారన్నారు. ఆర్డీటీ కాలనీలో వైసీపీ కార్యకర్తలు అక్రమాలను సైతం తాను తొలగించానని జేసీకి దమ్ముంటే అతడి అనుచరుల అక్రమాలు కూల్చివేతకు ముందుకు రావాలని పెద్దారెడ్డి సవాల్ విసిరారు. దీంతో తాడిపత్రి రాజకీయం అట్టుడుకుతుంది. గతంలో కూడా పెద్దారెడ్డి, జేసీ వర్గీయుల మధ్య వర్గపోరు నడిచింది. అప్పుడు కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇప్పుడు కూడా అలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయేమోనని స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed