ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇన్సూరెన్స్ పాలసీ!

by  |
ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇన్సూరెన్స్ పాలసీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సంవత్సరం అన్ని రంగాల్లో కీలక మార్పులను తీసుకొచ్చింది. అనేక కంపెనీలు, పరిశ్రమలు కార్యకలాపాలను నిర్వహించడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ సంస్థ పాలసీబజార్ ‘జాబ్‌లాస్’ పేరున ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. దీని ద్వారా ఉద్యోగాలను కోల్పోయిన వారు ఇన్సూరెన్స్ పొందే వీలుంటుంది. పాలసీబజార్ ప్లాట్‌ఫామ్‌లో ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ జనరల్, యూనివర్సల్ సోంపో, శ్రీరామ్ జనరల్ వంటి సంస్థల నుంచి జాబ్‌లాస్ ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు. అదేవిధంగా ఈ జాబ్‌లాస్ పాలసీ ఉద్యోగులకు మాత్రమే కాకుండా స్వయం ఉపాధి కలిగిన వారు కూడా తీసుకునే వీలుంటుంది.

ఈ ప్లాన్‌లో రెండు రకాల కవరేజీ లభిస్తుంది. సంస్థలు ఉద్యోగులను తొలగించడం ద్వారా కవరేజీ పొందవచ్చు. ఈ విధానం ద్వారా ఉద్యోగం కోల్పోతే ఇన్సూరెన్స్ కంపెనీలే మూడు నెలల వరకు లోన్‌లను చెల్లిస్తాయి. మరొక పద్దతిలో మరణం వల్ల కానీ, అంగవైకల్యం ద్వారా కానీ పొందవచ్చు. ఈ విధానంలో ఉద్యోగాన్ని కోల్పోతే రెండేళ్ల వరకు వారానికి ఒకసారి కొంత వేతనాన్ని పొందవచ్చు. ఉద్యోగులకు, స్వయం ఉపాధిని పొందుతున్న వారికి వేర్వేరు ప్లాన్‌లు ఉన్నట్టు పాలసీబజార్ తెలిపింది. పాలసీదారులు తమకు అవసరమైన పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీని బట్టి ప్రీమియం ఉంటుంది. అలాగే, ఇటువంటి పాలసీని తీసుకున్న వారు ఆదాయ పన్ను చట్టంలో ఉన్న సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపును పొందవచ్చు.


Next Story

Most Viewed