కిడ్నాప్ కలకలం.. నాలుగు గంటల్లో ఛేదించిన పోలీసులు

by  |
కిడ్నాప్ కలకలం.. నాలుగు గంటల్లో ఛేదించిన పోలీసులు
X

దిశ, క్రైమ్ బ్యూరో : బంజారాహిల్స్‌లో ఓ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. కిడ్నాప్‌కు సంబంధించిన వివరాలను సీపీ అంజనీకుమార్ శుక్రవారం తెలిపారు. శ్రీనగర్ కాలనీలో నివసించే అమర్ నాథ్ రెడ్డి (35) సినీ ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ గా, ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. చెన్నైకి చెందిన జునైద్ , అనులకు అమర్‌నాథ్ రెడ్డి ఫ్రెండ్ బిల్డర్ వెంకటేష్ కు మధ్య రూ.13.5 లక్షలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివాదం కొనసాగుతోంది. వివాదాన్ని పరిష్కారించాలని అమర్ నాథ్ రెడ్డిని వెంకటేష్ సంప్రదించాడు. దీంతో చైన్నైలోని స్నేహితులైన ప్రదీప్ నటరాజన్, కుమార గురు, లోకేష్ కుమార్‌లను అమర్ నాథ్ రెడ్డి సంప్రదించాడు. వివాదం పరిష్కరించడంతో రూ.13.5 లక్షలు అమర్ నాథ్ రెడ్డి తీసుకుని వచ్చాడు. సెటిల్మెంట్‌లో భాగంగా వారితో అంగీకరించిన ప్రకారం రూ.4 లక్షలు ఇవ్వకుండానే అమర్ నాథ్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చాడు. దీంతో పలు మార్లు ఫోన్ చేసినా.. స్పందించకపోవడంతో ప్రదీప్ నటరాజన్ గ్యాంగ్ అమర్ నాథ్ రెడ్డి కిడ్నాప్ కు ప్లాన్ వేశారు.

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 గంటలకు మాదాపూర్‌లోని కార్యాలయానికి వెళ్లిన అమర్ నాథ్ రెడ్డి తిరిగి రాకపోగా, మధ్యాహ్నం 1.20 గంటలకు అమర్ నాథ్ రెడ్డి భార్య కల్పనారెడ్డికి కిడ్నాపర్లు ఫోన్ చేసి కిడ్నాప్ వ్యవహారం చెప్పారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల్లోగా రూ.4 లక్షలు ఇవ్వకపోతే, చైన్నై తీసుకెళ్లి హత్య చేస్తామని బెదిరించారు. అంతే కాకుండా, డబ్బు సమకూర్చాలని పలు మార్లు ఫోన్ చేయడంతో అమర్ నాథ్ రెడ్డి భార్య కల్పనా రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీసులే డబ్బు సమకూర్చి ఆగంతకులను శ్రీనగర్ కాలనీ రావాలని చెప్పారు. డబ్బు తీసుకోవడానికి ప్రదీప్ కుమార్ నటరాజన్, లోకేష్ కుమార్‌లు సాయంత్రం 6.30 గంటలకు రాగా, పోలీసులకు లోకేష్ కుమార్ చిక్కగా, ప్రదీప్ కుమార్ నటరాజన్ తప్పించుకున్నారు. లోకేష్ కుమార్‌ను విచారించగా, సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా మిగతా మరో ముగ్గురు నిందితులను నల్లగొండ జిల్లా మాడుగుల వద్ద స్థానిక పోలీసుల సహకారంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు.

Next Story

Most Viewed