రాజీవ్ నగర్‌లో కార్డన్ సెర్చ్.. రెండు బెల్టు షాపులు సీజ్

by  |
DSP Mohan Kumar
X

దిశ, సూర్యాపేట: సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డీఎస్పీ మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. అసాంఘిక కార్యకలాపాల అణిచివేతం కోసం శనివారం పట్టణంలోని రాజీవ్ నగర్‌లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మోహన్ కుమార్ మాట్లాడుతూ.. అసాంఘిక చర్యల నివారణలో పోలీసు సిబ్బందితో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. మీ ప్రాంతంలో అసాంఘిక చర్యలు జరగకుండా ఉండాలంటే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని, కాలనీల్లో యువత అప్రమత్తంగా, ఆదర్శంగా ఉండాలని అన్నారు.

ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం కోసం కార్డన్ సెర్చ్‌లు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంతో ప్రజల్లో భద్రత ఏర్పడుతుందని, అనుమానిత వ్యక్తులను గుర్తించడానికి వీలుంటుందని అన్నారు. సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్‌లో రెండు బెల్ట్ షాపులు, 19 వేల విలువ గల మద్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. సరైన పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను సీజ్ చేశామన్నారు. ఈ కార్డన్ సెర్చ్‌లో 85 మంది పోలీసు సిబ్బంది పాల్గొని, కాలనీలోని దాదాపుగా 350 నివాసాలు తనిఖీ చేశామన్నారు.


Next Story