గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్

by  |
garavelli project
X

దిశ, హుస్నాబాద్: పరిహారం ఇవ్వకుంటే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు జరగనివ్వమని భూ నిర్వాసితులు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ప్రాజెక్టు పనులను భూ నిర్వాసితులు అడ్డుకొని మాట్లాడారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టుపై కట్టపై సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకుని కూర్చుని పనులు చేయిస్తానని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదు, ప్రాజెక్టు నేటికీ పనులు పూర్తి కాలేదన్నారు.

కేసీఆర్ సొంత జిల్లా అయిన సిద్దిపేటలో కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ వంటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం ఏ విధంగా ఇచ్చారు, అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రావాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిస్థాయిలో ఇవ్వకుండా పనులు ప్రారంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పోలీసు బలగాలను మోహరించి అధికారులు ప్రాజెక్టు కట్టను మూసేస్తుండడంతో నిర్వాసితులు అధిక సంఖ్యలో పాల్గొని పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో నిర్వాసితులు పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లాఠీచార్జిలో భూ నిర్వాసితులు తీవ్రంగా గాయపడగా పలువుర్ని ఆస్పత్రికి తరలించారు.

న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలి: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

కట్టిన ఇల్లు, పెట్టిన పోయ్యి వదిలి పోతున్న భూనిర్వాసితులకు న్యాయబద్ధమైన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టు కన్నా తర్వాత ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టు మాత్రం నత్తనడకన సాగుతోంది ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిహారం ఇచ్చి పనులు చేపట్టాలని లేని పక్షంలో భూ నిర్వాసితుల పక్షాన పోరాటాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Next Story

Most Viewed