కంత్రీ ప్లాన్ ఇలా అడ్డం తిరిగింది 

by  |
కంత్రీ ప్లాన్ ఇలా అడ్డం తిరిగింది 
X

దిశ, వెబ్ డెస్క్: ఒళ్ళు వంగకుండా, కష్టపడకుండా డబ్బులొస్తే ఎవరికి మాత్రం సుఖం ఉండదు చెప్పండి. బాగా పని ఒత్తిడి పెరిగినప్పుడు సామాన్యులు ఇలా ఒక ఫాంటసీ వరకు ఊహించుకుని వదిలేస్తారు. కానీ ఈ బడుద్ధాయి అలా వదిలేయలేదు. కంత్రీ ప్లాన్ వేశాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కి అడ్డంగా బుక్కయ్యాడు.

వాహనాలను దొంగిలించి వాటి విడి భాగాలను అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఇటీవల ఓ లారీ చోరీ కావడంతో ఆ కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ దొంగ దొరికేశాడు. రాచకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆగస్టు 13న వనస్థలిపురం ఆటోనగర్‌లో నిలిపి ఉన్న తన లారీని ఎవరో ఎత్తుకెళ్లారని శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో ఆటోనగర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఒక యువకుడు లారీ టైర్లతో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పలు దుకాణాలకు తిరుగుతూ వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడు. పోలీసులు అతడిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పాడు. వారి స్టైల్లో నాలుగు తగిలించగా అసలు నిజం కక్కేశాడు. ఆటో నగర్ నుంచి లారీని తీసుకెళ్లి నకిరేకల్ పట్టణ శివారులో పార్క్ చేశానని చెప్పాడు. అనంతరం లారీ టైర్లు ఊడదీసి తీసుకెళ్లినట్లు నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

లారీ చోరీ చేసిన ఆ యువకుడి పేరు కొత్తపల్లి సాయిబాబా, వయసు 22 ఏళ్ళు అని పోలీసులు వెల్లడించారు. వృత్తి లారీ డ్రైవర్ గా చేసే ఇతను నల్లగొండ జిల్లా శాలిగౌరార మండం తుడిముడి గ్రామానికి చెందినవాడని తెలిపారు. హైదరాబాద్ నల్లకుంటలో అద్దె ఇంట్లో ఉంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడన్నారు. విచారణలో నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా నార్కట్‌పల్లికి వెళ్లిన పోలీసులు.. అక్కడ లారీని స్వాధీనం చేసుకున్నారు. రూ.10 లక్షల విలువైన ఆ లారీని ఓనర్ శ్రీనివాస్‌కు అప్పగించారు.


Next Story

Most Viewed