రీ మోడలింగ్ ​వాహనాలపై పోలీసుల నజర్

by  |
రీ మోడలింగ్ ​వాహనాలపై పోలీసుల నజర్
X

దిశ, హైద‌రాబాద్: మ‌హాన‌గ‌రంలో రోడ్డుపై ప‌గ‌లు, రాత్రి తేడా లేకుండా కొంత మంది ఉద్దేశపూర్వకంగా పెద్దగా హార్న్ కొడుతూ చిరాకు పుట్టిస్తుంటారు. ఇది చూసేవాళ్లకు నచ్చకపోయినప్పటికీ ఏం చేయలేని పరిస్థితి. ట్రాఫిక్ పోలీసుల ముందు నుంచే ప్రెషర్ హార్న్స్, ఫ్యాన్సీ సైలెన్సర్లతో వెళ్తుండ‌డం ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం చూశాం. ఇక ముందు ఇలాంటి వారి ఆట‌లు ఇక సాగ‌వు. వాహ‌నాల‌కు అధిక శ‌బ్ధం వ‌చ్చేలా హారన్, సైలెన్స‌ర్ బిగించుకునే వారిని గుర్తించి కేసులు న‌మోదు చేస్తున్నారు. ముఖ్యంగా బుల్లెట్ వాహ‌న‌దారులు వాహ‌నం వెంట వ‌చ్చిన హారన్‌ను తొల‌గించి దాని స్థానంలో అధిక శ‌బ్ధం వ‌చ్చే వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. రోడ్డు మీద ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో అదే ప‌నిగా హార్న్ కొడుతూ ఇత‌రుల‌కు ఇ బ్బందులు క‌ల్గిస్తున్నారు. దీనిని న‌గ‌ర పోలీసుల శాఖ గుర్తించింది. ఇందులో భాగంగా నిబంధ‌న‌ల మేర‌కు హార్న్,సైలెన్స‌ర్ లు లేని వాహ‌నాల‌ను ట్రాఫిక్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ చేప‌డుతూ స్వాధీనం చేసుకుంటున్నారు.

జ‌బ్బుల బారిన ప‌డే అవ‌కాశం …

వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ నిబంధ‌న‌ల ప్రకారం 55 డెసిబెల్స్ కు పైబడి ఉండే మోతలు మానవ ఆరోగ్యానికి హాని క‌ల్గిస్తాయి. శబ్ధకాలుష్యం చాలా సున్నితమైన అంశం కాగా దీనివల్ల అప్పటికప్పడు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపనప్పటికీ పరోక్షంగా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. పరిమితి మించిన శబ్ధాల వల్ల బీపీ, గుండె జబ్బులు, వినికిడి లోపం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్నారులు, విద్యార్థులు, ఉద్యోగులు, వయసు పై బడిన వాళ్లు ఇలా ఏ వర్గం వారైనా శ‌బ్ధ కాలుష్యం బారిన పడి చేసే పనిపై దృష్టి సారించలేకపోతున్నారు. న‌గ‌రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ శబ్ధకాలు ష్యానికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. రాత్రి వేళలో న‌గ‌రంలో అత్యంత ర‌ద్దీ ప్రాంతాలైన కూక‌ట్ ప‌ల్లి , అమీర్ పేట్ , కోఠి, అబిడ్స్ , దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్ , ఖైరాతాబాద్, పంజాగుట్ట , బేగంపేట్ త‌దిత‌ర ప్రాంతాల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల‌తో పాటు బ‌స్సులు కూడా మోగించే ప్రెషర్ హారన్స్ సుమారు 100 డెసిబుల్స్ వ‌ర‌కు శ‌బ్ధం విడుద‌ల చేస్తున్నాయి. ఫ్యాన్సీ సైలెన్సర్లు, ప్రెషర్ హార్న్స్..అమర్చుకున్న కార్లు, బైక్లు, బస్సులు ఇలా అనేక వాహనాలు నగరంలో శబ్ధ కాలుష్యం పెంపునకు కారణమవుతున్నాయి.శబ్ధం కాలుష్యం ఆరోగ్యాన్ని, ప్రవర్తనను రెండింటినీ ప్రభావితం చేస్తుంది.

ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్పెష‌ల్ డ్రైవ్ …

అనవసరంగా సౌండ్ చేసే వారిని గుర్తించి స్పెషల్ డ్రైవ్ ద్వారా కేసులు న‌మోదు చేస్తున్నారు. ముఖ్యంగా బుల్లెట్ వాహ‌ నాల‌కు ఫ్యాన్సీ సైలెన్సర్లు, ప్రెషర్ హార్న్స్ అమర్చుకున్న వారిని పై కేసులు న‌మోదు చేస్తున్నారు. వాహ‌నాలు జ‌ప్తు చేయ‌డ‌మే కాదు రూ.5 వేల నుంచి రూ 10 వేల వ‌ర‌కు ఫెనాల్టీ విధించేందుకు అధికారులు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు. తయారీ కంపెనీలు సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ ప్రకారం పరిమితికి మించని హార్న్ సిస్టంని వాహనంతోపాటు అందిస్తాయి. అయితే కొందరు అది నచ్చక నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రెషర్ హారన్ వినియోగిస్తున్నారు. ఇవి చేసే శబ్ధాలు ఇతరులకు హానికరంగా మారుతున్నాయి. ఇంతటి అనార్థాలకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

వాహ‌నాల‌కు ప్ర‌త్యేక హారన్, సైలెన్స‌ర్‌ల‌ను అమ‌ర్చుకున్న వారిని గుర్తించ‌డానికి గ‌త కొన్ని రోజులుగా స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నాం. హారన్, సైలెన్స‌ర్ శ‌బ్ధాలు నిబంధ‌న‌ల మేర‌కు లేని వారిపై ప్ర‌తినిత్యం అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి వాహ‌నాల‌ను గుర్తించి కేసులు చేస్తున్నాం. అన్ని వాహ‌నాల‌ను త‌ని ఖీ చేస్తున్న‌ప్ప‌టికీ బుల్లెట్ వాహ‌నాల‌తో స‌మ‌స్య‌లు అధికంగా ఫిర్యాదులు అందుతుండ‌డంతో వాటిపై దృష్టి సారించాం. ఇలా ప్ర‌తి రోజు ప్ర‌తి ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో 20 వ‌ర‌కు వాహ‌నాలు ప‌ట్టుబడుతున్నాయి. వీటిని స్వాధీనం చేసుకుని ఆర్టీఏ అధికారుల‌కు అప్ప‌గిస్తున్నాం. వారి వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకుని రూ. 5 నుంచి రూ 10 వేల వ‌ర‌కు ఫెనాల్టీ విధించ‌డ‌మే కాకుండా హారన్, సైలెన్స‌ర్‌లు మార్చిన త‌ర్వాత‌నే వాహ‌నాలు తిరిగి అప్ప‌గిస్తున్నారు.-శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ, తూర్పు మండ‌లం


Next Story

Most Viewed