గ్రేటర్ ప్రచారంలో ప్రధాని మోడీ.. హైదరాబాదుకు భారీ ప్యాకేజీ?

362

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ నగరాన్ని సందర్శించనున్నారు. ఇప్పటికే బీజేపీకి చెందిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఇతర రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు హైదరాబాద్ నగరానికి వస్తున్న సమయంలో ప్రధాని టూరు ఖరారు కావడం గమనార్హం. ఈ నెల 28వ తేదీన జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌లో జరిగే ఒక కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. అయితే ఆ సమయానికి గ్రేటర్ ఎన్నికలకు ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటున్నందున ప్రధాని నగర పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఎలాగూ అధికారిక కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్ వస్తున్నందున బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేలా రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ సర్వ శక్తులనూ ఒడ్డుతోంది. అందులో భాగంగానే ప్రధాని మోడీని సైతం ఎన్నికల ప్రచారంలోకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆహ్వానించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చన్నది ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచన. ఇప్పటికే బీజేపీ జీహెఛ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతీ ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్లు ఆ పార్టీ పేర్కొన్నందున భారత్ బయోటెక్ సందర్శన సందర్భంగా ప్రధాని ద్వారానే ఈ సందేశాన్ని ఇప్పించే అవకాశం లేకపోలేదు.

భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే ఫార్మా, వ్యాక్సిన్ హబ్‌గా ఉన్నందున భవిష్యత్తులో మరింత దీటుగా తీర్చిదిద్దుతామని, కేంద్రం నుంచి ఆర్థికపరంగానే కాక అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం అనేక హామీలు గుప్పిస్తున్నందున ప్రధాని ద్వారా కూడా ఇలాంటి ప్రకటన ఇప్పించే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని పర్యటన అధికారికమే అయినా గ్రేటర్ ఎన్నికల సమయంలో ఆయన నగరాన్ని సందర్శించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.