‘అంగన్ వాడీలకు పీఎం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని వర్తింపజేయాలి’

by  |
‘అంగన్ వాడీలకు పీఎం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని వర్తింపజేయాలి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : అంగన్ వాడీలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ వర్తింప చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. ఢిల్లీలో శుక్రవారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ పిల్లలు, బాలింతలు, గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు పోషన్ అభియాన్ గడువు పెంచాలని కోరారు. కొవిడ్-19 సందర్భంగా పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తల బీమా కోసం ప్రారంభించిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు కూడా వర్తింప చేయాలన్నారు. కేంద్రం న్యూట్రీషన్ ప్రోగ్రాం కింద అదనపు పోషకాహార కార్యక్రమంలో ఇచ్చే జొన్నలు, సజ్జల చిరుధాన్యాల కోటాను పెంచాలని కోరారు. 2021 సంవత్సరానికి 5,427 మెట్రిక్ టన్నుల జొన్నలు, 2,714 మెట్రిక్ టన్నుల సజ్జలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని విజ్ణప్తి చేశారు.

సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) కింద కేంద్రం కొన్ని సేవలు ఉపసంహరించడం, కేంద్ర కోటాను తగ్గించడం వల్ల రాష్ట్రంలో పిల్లలు, బాలింతలు, గర్భిణీల కోసం చేపట్టే కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోందని, 2017 వరకు గల కోటాను తిరిగి పునరుద్ధరించాలన్నారు. రాష్ట్ర ఐసీడీఎస్ ప్రాజెక్టులో అంగన్ వాడీల వేతనాలను గతంలో 60 :40 శాతంగా కేంద్రం, రాష్ట్రం భరిస్తే వాటిని 25 : 75 శాతానికి తగ్గించారని, కొన్ని పోస్టులను తొలగించారని, తగ్గించిన కోటాను ఇంతకు ముందు వలె కొనసాగించాలని, తొలగించిన పోస్టులను పునరుద్ధరించాలని కోరారు. వీటితో పాటు రాష్ట్ర, జిల్లా, ప్రాజెక్టు కార్యాలయాల్లోని పరిపాలనా వ్యయం మొత్తాన్ని ఆపేశారని, కిరాయిలు, ఐఈసీ కాంపోనెంట్ ను కూడా ఆపేశారని, వీటిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా కేంద్రమంత్రి స్పందిచినట్లు తెలిపారు. మంత్రి వెంట ఎంపీ కవిత, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ గుండు సుధారాణి, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఉన్నారు.


Next Story

Most Viewed