మనం రోజుకు ఫోన్‌ను ఎన్నిసార్లు చూస్తామో తెలుసా..?

by  |

దిశ, ఫీచర్స్: మొబైల్‌తో ప్రేమానుబంధం బలమైందే కాదు దృఢమైంది కూడా. ఉదయాన్నే ‘అలారం’తో మొదలయ్యే ఆ బంధం, రాత్రి పడుకునే వరకు బ్రేక్ లేకుండా కొనసాగుతుంది. బెడ్‌ దిగకముందే మొబైల్, ల్యాపీలో కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డ నోటిఫికేషన్స్, ఈ-మెయిల్స్ చెక్ చేసేస్తాం. బ్రష్ చేస్తూనే స్టేటస్ అప్‌డేట్స్ ఫినిష్ చేస్తాం. ఆ తర్వాత బాత్రూమ్‌లోనూ ఫోన్ వదలని విక్రమార్కుల సంగతి సరేసరి! ఇక కాఫీ తాగుతూ ట్విట్టర్‌ హెడ్‌లైన్స్ స్కాన్ చేసేసి.. ఆఫీస్‌కు వెళ్తూనే ఎఫ్‌బీ నుంచి స్నాప్‌చాట్ మీదుగా ఇన్‌స్టా వరకు క్షేమసమాచారాలు, బ్రేకింగ్స్, శుభాకాంక్షలు ముగించేసి.. ఆఫీస్ వర్క్ అంటూ మరో స్క్రీన్‌లో తలదూర్చేస్తాం. అప్పుడైనా మనసు కుదురుగా ఉంటే కదా! మొబైల్‌ నోటిఫికేషన్ సౌండ్ వినగానే.. ఏం వచ్చింది, ఏం జరిగింది, ఎవరు ఎక్కడికి వెళ్లారు, ఏం స్టేటస్ అప్‌డేట్ చేశారో? చూసేవరకు మైండ్ ఊరుకోదు. ఇలా నోటిఫై బటన్‌ మనల్ని నిత్యం డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఇదేకాదు మొబైల్ స్క్రీన్‌పై మిణుమిణుకుమనే చిన్న రెడ్ డాట్ నోటిఫికేషన్లను క్లియర్ చేసేందుకు కూడా చాలామంది తరచూ మొబైల్ చూస్తుంటారు. ఏదేమైనా ఆ బుజ్జి చుక్కే.. ఆ అనవసర నోటిఫికేషన్సే.. మన మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు మెదడును కూడా ప్రభావితం చేస్తోంది.

టెక్స్ట్ మెసేజెస్ లేదా మొబైల్ నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకోవడం మనకు తెలియని అనుభూతిని కలిగిస్తుంది. మన మెదడులో ‘డోపమైన్’ విడుదల కావడమే అందుకు కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్స్ చూడటం కూడా మాదకద్రవ్యాలు లేదా ఆల్కహాల్ వినియోగం వంటి వ్యసనమే. ఓవర్‌లోడ్ ఇన్ఫర్మేషన్ కారణంగా డెసిషన్ మేకింగ్, ప్రొడక్టివిటీ స్కిల్స్‌పైనా వాటి ప్రభావముంటుంది. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ప్రకారం.. వర్క్ చేస్తున్నప్పుడు ఈమెయిల్ నోటిఫికేషన్ వల్ల అంతరాయం ఏర్పడితే, తిరిగి పనిపై ఫోకస్ చేసేందుకు సగటున 25 నిమిషాల 26 సెకన్ల సమయం పడుతుందట. ఈ లెక్కన ఒక వ్యక్తి రోజులో అందుకునే ఈ-మెయిల్స్ లేదా నోటిఫికేషన్స్‌ను లెక్కగడితే ఎంత టైమ్ వృథా చేస్తున్నారో అర్థమవుతుంది. కాగా పుష్ నోటిఫికేషన్స్ యూజర్లపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయని యూకేలో 2,000 పైగా వ్యక్తులపై జరిపిన అధ్యయనం వెల్లడించింది. మీడియా, మార్కెటింగ్, పీఆర్ నిపుణుల్లో ఈ ఒత్తిడిపాళ్లు ఎక్కువ కాగా, నోటిఫికేషన్స్ చదవకుండా వదిలేసినప్పుడు అది మరింత ఎక్కువైనట్లు తేలింది.

సోషల్ మీడియా

ప్రేమ పొంగినా, కలతలు కలవరించినా.. బ్రేకప్ చెప్పేసినా, బ్రేక్ సాధించినా.. సోషల్ మీడియా పోస్టుగానో, వాట్సాప్ స్టేటస్‌గానో సాక్షాత్కరించాల్సిందే. గడియారం లెక్కలు, రాత్రీ పగళ్లను మరిచిమరీ స్క్రోలింగ్‌ వలలో ఈదుతుంటాం. ఇది ఇంటికే పరిమితం కాలేదు, ‘వర్కింగ్ అవర్స్’లోనూ డిస్టర్బ్ చేసే స్థాయికి చేరింది. సోషల్ మీడియా అధిక వినియోగం(ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్) వల్ల సామాజిక పోలిక (సోషల్ కంపారిజన్) ఎక్కువైపోయింది. ప్రధానంగా ఇది ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్(FOMO)’‌తో ముడిపడి ఉంది. నిత్యం సోషల్ మీడియా యాప్స్‌లో గడిపేవారు.. తమ స్నేహితులు మెరుగైన జీవితాలను గడుపుతారని విశ్వసించడమే ఇందుకు కారణం. ఇలాంటి సామాజిక ఆందోళన, ఒంటరితనం, మానసిక కల్లోలానికి దారితీస్తుంది. ఒక వ్యక్తి రోజుకు సగటున 566 సార్లు స్క్రీన్స్ వైపు చూస్తున్నాడని అమెరికన్ డాక్టర్ మార్క్ పరిశోధన ఫలితాలు నిర్ధారించాయి. అంటే రోజులో సగం సమయం నోటిఫికేషన్స్‌ వల్ల డిస్టర్బ్ అవుతుంటే.. మిగతా టైమ్‌ను స్క్రోలింగ్‌ కారణంగా దూరం చేసుకుంటున్నాం.

నిరోధించడం ఎలా?

కొన్ని రూల్స్ పాటిస్తే నోటిఫికేషన్ ఓవర్‌లోడ్‌ గోల నుంచి తప్పించుకోవచ్చు. ముందుగా స్పెసిఫిక్ యాప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలి. పనివేళల్లో దృష్టిని మరల్చే డెస్క్‌టాప్ నోటిఫికేషన్స్, సౌండ్స్, ఐకాన్స్ కూడా ఆఫ్ చేయాలి. ఇక రోజులో ఒక్కో వ్యక్తి కనీసం 300కు పైగా మెయిల్స్ అందుకునే అవకాశముండగా.. మెయిల్ నోటిఫికేషన్స్ కూడా ఆఫ్ చేస్తేనే బెటర్. అంతేకాదు ‘కస్టమైజ్‌డ్ నోటిఫికేషన్’ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల వచ్చిన మెసేజ్ ఓపెన్ చేయకుండానే అది ముఖ్యమైందా? కాదా? అన్న విషయం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు.. టెక్స్ట్ మెసేజ్ కోసం లాంగ్ రింగ్‌టోన్, ఇన్‌కమింగ్ మెయిల్ కోసం స్మాల్ టోన్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇమెయిల్స్, టెక్స్ట్‌, సోషల్ మీడియా సందేశాలకు సమాధానం ఇవ్వడానికి స్పెసిఫిక్ టైమ్స్ ఫిక్స్ చేసుకోవడం కూడా ఉత్తమమైన ఆలోచనే. వ్యక్తిగత సమయంలో సోషల్ మీడియా యాప్స్ వినియోగించేందుకు లిమిటెడ్ టైమ్ కేటాయించుకుంటే.. ఒత్తిడిలేని జీవితాన్ని ఆస్వాదించేందుకు తగినంత సమయం మీకు లభిస్తుంది. అవసరంలేని యాప్స్ తొలగించడం కూడా మంచి నిర్ణయమే.

వేగవంతమైన కమ్యూనికేషన్‌కు అనుగుణంగా మన సంస్కృతి అభివృద్ధి చెందింది. కామెంట్స్, లైక్స్, ఆఫ్‌హ్యాండ్ రిక్వెస్ట్స్, నోటిఫికేషన్స్ రెప్పపాటులోనే సందడి చేస్తున్నాయి. కానీ, వీటి వల్ల తెలియకుండానే సమయాన్ని వృథా చేసుకుంటున్నాం. అనవసర చెత్తంతా మెదడులో పోగవడం వల్ల అసలైన జ్ఞానం పొందలేకపోతున్నాం. ప్రొఫెషనల్‌గానే కాక పర్సనల్‌గానూ క్వాలిటీ టైమ్ మిస్సవుతున్నాం. అందుకే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల వర్క్‌ ఫోకస్ పెంచేందుకు వీలుగా 25 నిమిషాల పాటు నోటిఫికేషన్స్ ఆఫ్ చేసే విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఆ తర్వాత మరో ఐదు నిమిషాలు విరామం తీసుకోవాలని సిఫార్స్ చేస్తున్నాయి. ఈ టెక్నిక్ ఉత్తమ ఫలితాలను అందిస్తుండగా, క్రమంగా ఆ సమయాన్ని పెంచడం వల్ల నోటిఫికేషన్స్, సోషల్ మీడియా వ్యసనాల నుంచి మెల్లగా బయటపడొచ్చు. ఆ తర్వాత రెడ్ ఐకాన్ కనిపించినా, లైట్ తీసుకుంటారు. స్వయంగా మీరే ఓ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని కొన్ని వారాలు పాటిస్తే.. మొబైల్, సోషల్ మీడియాపై నియంత్రణ పెరుగుతుంది.
– గ్లోరియా మార్క్, ఇన్ఫర్మేటిక్స్ ప్రొఫెసర్, కాలిఫోర్నియా యూనివర్సిటీ

Next Story

Most Viewed