నా కూతురి ఫొటోలు తియ్యొద్దు ప్లీజ్ : కోహ్లీ

47

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ జంటకు సోమవారం ఆడపిల్ల జన్మించిన విషయం తెలిసిందే. ముంబయి లోని ఒక ఆసుపత్రిలో అనుష్క డెలివరీ అయ్యింది. అప్పటి నుంచి కోహ్లీ బిడ్డను ఫొటోలు తీయాలని ఎంతో మంది మీడియా ఫొటోగ్రాఫర్లు ఎదురు చూస్తున్నారు. పాప పుట్టిన తర్వాత కోహ్లీ కూతరు’ అంటూ ఒక ఫేక్ ఫొటో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అంతే కాకుండా ఆసుపత్రి వద్ద మీడియా ఎక్కువగా గుమికూడటంతో పోలీసు భద్రత కూడా పెంచారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ దంపతులు సోషల్ మీడియాకు ఒక విజ్ఞప్తి చేశారు.

‘ ఇన్ని రోజు మీరు మా మీద ప్రేమ చూపించారు. మా జీవితంలోని అరుదైన క్షణాలను మేం ఆనందిస్తున్నాము. దయచేసి తల్లిదండ్రులుగా ఈ అనుభూతులను ఆస్వాదించనీయండి. కానీ ఒక చిన్న విజ్ఞప్తి. మా చిట్టితల్లిని మేం సమయం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాము. అప్పటి వరకు కావాలంటే మా ఫొటోలు తియ్యండి. కానీ నా కూతురు ఫొటోలను మాత్రం తీయవద్దు’ అని పేర్కొన్నారు. తమ బాధను అందరూ అర్దం చేసుకుంటారని భావిస్తున్నట్లు విరుష్క జంట ఆ ప్రకటనలో పేర్కొన్నది.