మేం ఏ పని చెప్తే అది చేయాల్సిందే.. లేకపోతే అంతే..

by  |
మేం ఏ పని చెప్తే అది చేయాల్సిందే.. లేకపోతే అంతే..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వైద్యాధికారుల తీరుతో ఫార్మసిస్టులకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. నగరంలో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో ఈ ఆస్పత్రిని ప్రభుత్వం కోవిడ్ హాస్పిటల్ గా గుర్తించి కరోనా రోగులకు సేవలందిస్తోంది. కాగా ఇక్కడ పని చేసే వైద్య సిబ్బంది తక్కువగా ఉండడంతో జిల్లాల నుండి వైద్య సిబ్బందిని తీసుకువచ్చి డిప్యూటేషన్ పై డ్యూటీ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు ఆయుర్వేదిక్ ఆస్పత్రుల నుండి ఫార్మసిస్టులను హాస్పిటల్ లో పని చేయడానికి కేటాయించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇలా డిప్యూటేషన్ పై పని చేసే ఫార్మసిస్టులతో రోగులకు మందులు ఇప్పించకుండా అటెండర్, వార్డు బోయ్ పనులు చేయించడం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో వారు విధులంటేనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ స్థాయికి తగ్గ విధులు కేటాయించాలని వారు ఆస్పత్రి పాలక వర్గం ముందు మొత్తకున్నా పట్టించుకోకుండా వార్డు బోయ్ పనులను చేయించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నీళ్లు, టీ మోయిస్తున్నారు….

జిల్లాలలోని ఆయుర్వేదిక్ ఆస్పత్రుల నుండి ఎర్రగడ్డ లోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆస్పత్రికి డిప్యూటేషన్ పై వచ్చిన పలువురు ఫార్మసిస్టులతో వారు చేయకూడని పనులను పాలక వర్గం చేయిస్తోంది. వార్డులలో రోగులకు నీళ్లు, టీ పోయడం, వార్డులను శభ్రం చేయించడం వంటివి చేయిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని సూపరింటెండెంట్ టార్గెట్ చేస్తోందని వారు దిశ ప్రతినిధి వద్ద వాపోయారు. మేం ఏ పని చెప్తే ఆ పని చేయాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లాలలోని ఆయుర్వేదిక్ ఆస్పత్రులలోని ఫార్మసీలకు తాళం వేసినట్టు చెప్పారు. దీంతో ఆయుర్వేద మందులు అవసరం ఉన్నవారు ఇబ్బందుల పాలవుతున్నారని, అయినా అధికారులు పట్టించుకోకుండా డిప్యూటేషన్లపై పంపించారని తెలిపారు. ఫార్మసిస్టులుగా మాకు మందులు అందించే బాధ్యత అప్పగిస్తే తప్పకుండా చేస్తాం, కానీ, వార్డు బోయ్ పనులు చేయిస్తే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సూపరింటెండెంట్ తమ తీరు మార్చుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed