మరోసారి భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు!

by  |
మరోసారి భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో చమురు ధరలను వింటే వాహనదారులు భయపడిపోతున్నారు. సాధారణ ప్రజలు సంపాదనలో సగటున 30 శాతం వరకు పెట్రోల్, డీజిల్ కోసమే ఖర్చు చేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. వారం రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్‌లపై 25 పైసలు పెంచిన చమురు కంపెనీలు సోమవారం మరోసారి ధరలను పెంచాయి. పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 25 పైసల పెంపుతో దేశీయంగా చమురు ధరలు కొత్త గరిష్టాలను చేరుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ. 84.95కి చేరుకుంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 91.56కి పెరిగింది. హైదరాబాద్‌లో సైతం ధరలు 26 పైసలు మేర పెరగడంతో లీటర్ పెట్రోల్ రూ. 88.37 ఉండగా, డీజిల్ రూ. 81.99కి చేరుకుంది. ఇటీవల చమురు ధరల పెరుగుదలను గమనిస్తే రానున్న కొద్దిరోజుల్లో హైదరాబాద్‌లోనూ లీటర్ పెట్రోల్ రూ. 90ని దాటిపోయే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరో రూపాయిన్నర పెరిగితే పెట్రోల్ రూ. 90కి చేరుకుంటుంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో చమురు ధరలను గమనిస్తే…చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 87.63 ఉండగా, డీజిల్ రూ.80.43 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ. 86.39, డీజిల్ రూ. 78.72గా ఉంది.

8 నెలల్లో పెట్రోల్ రూ. 15 పెరిగింది…

చమురు కంపెనీలు ఈ నెల మొదటివారంలో పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 26 పైసలను పెంచుతూ నిర్ణయించాయి. గడిచిన 15 రోజుల్లో చమురు ధరలు మూడోసారి పెరగడం గమనార్హం. 2020 క్యాలెండర్ ఏడాది రెండో సగంలో పెట్రోల్ ధర రూ. 80 చేరుకోగా, ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి. అంతర్జాతీయంగా కూడా చమురు ధరల పరిస్థితి ఇలాగే ఉంది. సౌదీతో పాటు చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఉత్పత్తిని తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. దీనికితోడు అంతర్జాతీయంగా కొవిడ్-19 కేసులు పెరుగుతుండటం, వ్యాక్సినేషన్ ప్రభావం నేపథ్యంలో డిమాండ్ పెరుగుతుందనే అంచనాల మధ్య చమురు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కి 57 డాలర్లు దాటిపోవడంతో దేశీయంగా చమురు కంపెనీలు ధరలను పెంచక తప్పలేదని చెబుతున్నాయి. దీంతో కొద్ది రోజుల వ్యవధిలోనే పెట్రోల్ 74 పైసలు, డీజిల్ 76 పైసలు పెరిగాయి. అదేవిధంగా, 2020 మే తర్వాత ఇప్పటివరకు లీటర్ పెట్రోల్‌పై రూ. 14.79 పెరగ్గా, డీజిల్ లీటర్‌పై రూ. 12.34 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రో ధర చివరిసారిగా 2018 చివర్లో రూ. 84గా నమోదు చేసింది. ఆ సమయంలో డీజిల్ ధర సైతం లీటరుకు రూ. 75కి పైగా నమోదైంది. ఆ తర్వాత గరిష్ఠ స్థాయిలో చమురు ధరలు పెరగడం ఇదే.


Next Story

Most Viewed