బిగ్ బ్రేకింగ్.. ఈటల పాదయాత్రకు శాశ్వత బ్రేక్

2416

దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్రకు ఇక శాశ్వత బ్రేక్ పడినట్టేనా? ఆయన కోలుకున్న తరువాత యాత్ర యథావిధిగా కొనసాగించే అవకాశం లేదా..? అంటే అవుననే అని తేటతెల్లం చేస్తున్నాయి ఆయన ఆరోగ్య సమస్యలు. జూలై 19న పాదయాత్ర ప్రారంభించిన రాజేందర్ ఈ నెల 30న తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్రను కొనసాగించిన ఆయన 70 గ్రామాల్లో 222 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. వీణవంక మండలం కొండపాకకు చేరుకున్న తరువాత అనారోగ్యానికి గురైన రాజేందర్ అర్థాంతరంగా తన పాదయాత్రను నిలిపివేయాల్సి వచ్చింది.

అదే రోజున ఆయన హుజురాబాద్‌కు చేరుకుని రెస్ట్ తీసుకుని మరునాడు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. రాజేందర్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు మోకాలి సమస్యను గుర్తించారు. ఈ మేరకు ఆయనకు మోకాలి ఆపరేషన్ చేయడంతో ప్రస్తుతం వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నారు. దీంతో కొంతకాలం బెడ్ రెస్ట్‌లోనే ఉండాల్సిన పరిస్థితి తయారైంది. అయితే మోకాలికి ఆపరేషన్ చేయడంతో రానున్న కాలంలో ఈటల రాజేందర్ సుదూర ప్రాంతాలు కాలినడకన సాగించే అవకాశం ఉండదు. ఒక వేళ నడిచినా మోకాలి గాయం తిరగబెట్టే ప్రమాదం కూడా ఉంటుంది. వయసు రిత్యా కూడా ఆయన పాదయాత్ర చేయడం వల్ల మోకాలి సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజేందర్ బెడ్ రెస్ట్ ముగిసినా పాదయాత్ర చేసే అవకాశం మాత్రం ఉండకపోవచ్చన్నది స్థానికుల అంచనా. ప్రచారంలో ప్రజలను కలిసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం తప్ప పాదయాత్ర చేయడం మాత్రం అంత సులువు కాదన్నది వాస్తవం. మోకాలి ఆపరేషన్ తరువాత కోలుకున్నప్పటికీ రాజేందర్ మాత్రం నిరంతరం పాదయాత్ర చేసేందుకు వైద్యులు కూడా విముఖత తెలిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

జాగ్రత్తలు తీసుకోకే..

అయితే దాదాపు 350 కిలోమీటర్ల మేర పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ఈటల రాజేందర్ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇంత దూరం తెచ్చిపెట్టిందా అన్న భావన వ్యక్తం అవుతోంది. సాధారణంగా పాదయాత్ర చేసేందుకు సమాయత్తం అయినప్పుడు వైద్యుల బృందాన్ని అందుబాటులో ఉంచుకోవడంతో పాటు, పోషక విలువలు ఉన్న ఆహారం అందించేందుకు కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉండే. అంతేకాకుండా నీ ప్యాడ్స్‌ను కూడా వాడినట్టయితే మోకాలి సమస్య ఇంత తీవ్రం కాకపోయేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ భవితవ్యం కోసం ప్రజా క్షేత్రంలో ఉండేందుకు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకున్న తరువాతే యాత్రకు నాందీ పలికితే బావుండేంది అని ఆయన అనచరులు అంటున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..