నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్

by  |
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై పీడీ యాక్ట్ చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు, వ్యవసాయ అధికారులు కలిసి అన్ని దుకాణాలలో తనికీలు నిర్వహించాలని సూచించారు.

రాష్ట్రంలో 60 లక్షల రైతు కుటుంబాలు దాదాపు 2.40 కోట్ల జనాభా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పుకొచ్చారు. మార్కెట్ లో నకిలీ విత్తనాలు చొరబడితే రైతులు తీవ్రంగా పంట నష్టపోతారని తెలిపారు. 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ కు కేంద్రం గరిష్ట ధర రూ.767 ఖరారు చేసిందని, అంతకు మించి ఎక్కువ ధరకు విక్రయాలు జరగకుండా చూసుకోవాలన్నారు. కంపెనీలు నాణ్యమైన విత్తనాలనే అమ్మాలని నాణ్యత లేకుంటే రైతు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా లేని విత్తనాలను పశువులకు దాణా కింద మార్చి వాడుకోవాలని సూచించారు.

కంపెనీలు తిరస్కరించిన విత్తనాలను తిరిగి మళ్లీ వాడాలని ప్రయత్నిస్తే చర్యలు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వానాకాలంలో గ్లైఫోసైట్ అమ్మడాన్ని నిషేధించడం జరిగిందని ఏ షాపులో కనిపించినా లైసెన్సులు రద్దు చేయండని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి సాగును పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమని .. ఈ వానాకాలం 70 లక్షల ఎకరాలలో సాగు చేయించాలన్న లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. తెలంగాణ పత్తికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నందునే రాష్ట్రంలో పత్తిని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

విత్తనరంగంలో నూతన సంస్కరణల కోసం సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. మిరప నారు అమ్మే నర్సరీలలో నాణ్యత లేని విత్తనాలతో తయారు చేసిన నారు అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకోండని అధికాలను ఆదేశించారు. కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చర్యల కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. శిక్షణా కార్యక్రమాలు చేపట్టి నకిలీ, కల్తీ విత్తనాలపై రైతులను చైతన్యం చేయాలని సూచించారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేస్తే దాని అనుబంధ రంగాలు బలోపేతమై రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి , వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదనపు డీజీ జితేందర్, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, సీడ్ టాస్క్ ఫోర్స్ ఐజీ నాగిరెడ్డి, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు, డీఐజీలు, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed