- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కరోనా వాహకులుగా రోగి అటెండర్స్
దిశ,తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న కరోనా పేషెంట్ల సహాయకులే కరోనా క్యారియర్లుగా మారుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని రోగాలకు అవసరమైన వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయడానికి తగిన లాబ్ సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు డాక్టర్లు రిఫర్ చేస్తున్నారు. రోగుల శాంపిళ్ళను వారి సహాయకులే నేరుగా తీసుకెళుతున్నారు. శాంపిళ్ళతో పాటు వారికి తెలియకుండానే వైరస్‌ను కూడా మోసుకెళ్తున్నారు.
కరోనాతో బాధపడుతున్న పేషెంట్లకు కొన్ని అనారోగ్య సమస్యలకు డీ-డైమర్, సీఆర్పీ, ఐఎల్-6, ఫెర్రిటిన్, ఎల్‌డీహెచ్ వంటి టెస్టులు చేయాల్సి వస్తోంది. ఊపిరితిత్తులు ఏ మేరకు దెబ్బతిన్నాయి, రక్తంలో ఇన్ ఫెక్షన్ ఏ స్థాయిలో ఉంది, వైరస్‌తో పాటు ఇంకేమైనా బ్యాక్టీరియా సోకిందా లాంటి అంశాలను తెలసుకునేందుకు ఈ టెస్టులు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. పేషెంట్ శరీరంలో ఇంటర్నల్‌గా ఏమేం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి నిర్ధారించడానికి ఈ పరీక్షలు అవసరం. ఇందుకోసం రోగి శాంపిళ్లను బయటకు పంపిస్తుండడంతో సరికొత్త ప్రమాదం ముంచుకొచ్చింది.
ప్రభుత్వ డాక్టర్లే పరోక్షంగా కరోనా వ్యాధి వ్యాప్తికి కారకులవుతున్నారు. సర్కారు దవాఖానల్లో లాబ్ సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు టెస్టులకు సగటున రూ.20 వేల వరకు రోగులు భరించాల్సి వస్తోంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు కంటికి తెలియకుండా ఖర్చు చేయాల్సి వస్తోంది. పేషెంట్‌తో పాటు సహాయకులు కూడా వైరస్ బారిన పడాల్సి వస్తోంది.
కరోనా వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్సలు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ మేరకు సదుపాయాలను కల్పించలేకపోయింది. గాంధీ ఆసుపత్రి లాంటి కొన్ని బోధనాసుపత్రులను మినహాయిస్తే వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న జిల్లా కేంద్రాల్లో ని ఆసుపత్రుల్లో నిర్దిష్ట పరీక్షలు చేయడానికి లాబ్ సౌకర్యం లేదు. లాబ్‌లలో వాటికి అవసరమైన ఉపకరణాలు కూడా లేవు. ఈ టెస్టుల్లో వచ్చిన రిజల్ట్ ఆధారంగా రోగులకు అవసరమైతే స్టెరాయిడ్స్ ఇవ్వడం, ఔషధాల డోసుల స్థాయిని పెంచడం, తగ్గించడం వంటివి చేస్తారు.
ఈ పరీక్షలన్నింటిని చేసేందుకు ఫుల్లీ ఆటో బయోకెమిస్ర్టీ అనలైజర్, కొవాగ్యులో మీటర్ అనే యంత్రాలు అవసరమవుతాయి. ఇవన్నీ కూడా కేవలం ‘గాంధీ’ లాంటి ఆసుపత్రుల్లో తప్ప ప్రస్తుతం కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తున్న ఇతర ఆసుపత్రిల్లో లేవు. కరోనా నోడల్ సెంటర్లుగా ఉన్న కింగ్ కోఠి హాస్పిటల్, గచ్చిబౌలిలోని టిమ్స్‌లో కూడా టెస్టులు చేసే సదుపాయం లేకపోవడంతో నారాయణగూడలోని ‘తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్’లకు పంపిస్తున్నారు. శాంపిళ్ళను పంపిన మరుసటి రోజు రిజల్ట్ వస్తుంది. వరంగల్ ఎంజీఎం, నిజామాబాద్ జీజీహెచ్ వంటి దవాఖాన్లలో కూడా టెస్టులను ప్రైవేటు లాబ్‌లకు రిఫర్ చేయక తప్పడంలేదు. కరోనా రోగులకు అవసరమైన సీటీ స్కాన్ మిషన్లు కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నా పనిచేయడంలేదు.
సీరియస్ అయితే హైదరాబాద్ కు రెఫర్
కరోనా సివియర్ పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందజేస్తున్న జిల్లా దవాఖానలు, టీచింగ్ హాస్పిటళ్లలో వ్యాధి నిర్థారణ చేసే యంత్రాలు ఎక్కడా అందుబాటులో లేవు. జిల్లాల్లో కరోనా వ్యాధి అధికంగా వ్యాపిస్తుండటంతో అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో చికిత్సలు అందించే ఏర్పాట్లు జరిగాయి. ఆదిలాబాద్ ‘రిమ్స్’, సిద్ధిపేట, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ టీచింగ్ హాస్పిటళ్లు, కరీంనగర్, ఖమ్మం జిల్లా హాస్పిటళ్లలో సీరియస్ పేషెంట్లకు చికిత్సలు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని రోగులు టెస్టులు చేయించుకోలేకపోతే వారికి అంచనా ప్రకారం చికిత్సలు చేస్తున్నారు. ‘దాదాపు 80 శాతం వరకు మా అంచనా కరెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు అంచనా తప్పితే పేషెంట్ కండీషన్ సీరియస్ అవుతుంది’ అని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఒకరు సమాచారం ఇచ్చారు. పరిస్థితి విషమించిన కరోనా రోగులను గాంధీ, ‘టిమ్స్’ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో చేరిన రెండ్రోజుల్లో కరోనా రోగులు చనిపోతున్నారు.