మీ పిల్లలకు ఏమైనా.. మా బాధ్యత కాదు

by  |
మీ పిల్లలకు ఏమైనా.. మా బాధ్యత కాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భౌతిక తరగతులకు హాజరు కావడం తప్పనిసరేమి కాదని, అయితే క్లాసులకు హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని విద్యాశాఖ ప్రకటించింది. ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి కార్పొరేట్ విద్యాసంస్థలు. హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులకు కరోనా సోకిన యాజమాన్యానికి ఎటువంటి సంబంధం ఉండదని, ట్రీట్మెంట్ చేయించిన తర్వాత తిరిగి కాలేజీలకు తీసుకొస్తామనేలా పేరేంట్స్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నాయి. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి జూనియర్ కాలేజీలు కూడా ప్రారంభం కానున్నాయి.

ప్రైవేట్ కళాశాలలు కూడా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో ప్రముఖ కార్పొరేట్ యాజమాన్యాలు ఈ నిబంధనలు తమకు వర్తించవనేలా ప్రవర్తిస్తున్నాయి. తమ రెసిడెన్షియల్ బ్రాంచిల్లో ఉండి చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు కాలేజీ ప్రారంభంపై సమాచారాన్ని ఇచ్చాయి. దీంతో పాటు విద్యార్థులను వచ్చేటపుడు పేరెంట్స్ డిక్లరేషన్ కూడా కోరుతున్నాయి. ఫిజికల్ క్లాసులకు వెళ్లడానికి మాత్రమే తల్లిదండ్రులు తమ అనుమతిని తెలియజేయాల్సి ఉండగా.. యాజమాన్యాలు ఒకడుగు ముందుకేసి తమ పరిధిలో విద్యార్థికి ఎలాంటి అనారోగ్యానికి గురైనా తమకు సంబంధం లేదని రాయించుకుంటున్నాయి. ఏ రకంగానూ యాజమాన్యాన్ని బాధ్యులుగా చేయబోమని ముందుగానే రాయించుకుంటుండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రుల ఆగ్రహం..

కార్పొరేట్ హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు ఇంటి నుంచి దూరంగా ఉంటారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో కాకుండా విద్యాసంస్థల ఆధీనంలో ఉంటారు. అలాంటప్పుడు తమ పిల్లలు ఏమి చేస్తున్నారన్నది ఎలా చూడగలమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ఆరోగ్యం విషయంలో తమను ప్రశ్నించకూడదని యాజమాన్యాలు లిఖితపూర్వకంగా హామీ తీసుకోవడమంటే.. కొవిడ్ నిబంధనలు పాటించడం కుదరదని చెప్పుకున్నట్టేనని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. లక్షల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు కొవిడ్ రూల్స్ పాటించడంలో విఫలమవుతున్నాయని వాపోతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ రెసిడెన్సియల్ విద్యార్థులకు కూడా కొవిడ్ జాగ్రతలు అమలయ్యేలా ప్రభుత్వం చూడాలని వారు కోరుతున్నారు.

ఆందోళన కలిగించేలా ఉంది: – అబ్బయ్య, విద్యార్థి తండ్రి

పిల్లలు మా కళ్ల ముందు ఉంటే మేము చూసుకోగలం. యాజమాన్యాలను నమ్మే కదా హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నాం.. ఎక్కడెక్కడ నుంచో పిల్లలు వస్తుంటారు. అందరినీ పరీక్షించాల్సిన బాధ్యత కాలేజీలదే.. లక్షల ఫీజులు కట్టి చదివిస్తున్నపుడు కొవిడ్ జాగ్రతలు పాటించలేకపోతున్నారు. పిల్లలు బాగా చదవాలని హైదరాబాద్‌లో వేస్తున్నాం.. జిల్లాల్లో ఉన్న మాకెలా తెలుస్తుంది కాలేజీలు కొవిడ్ రూల్స్ అమలు చేస్తున్నాయో లేదోనని.



Next Story

Most Viewed