నాలుగేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ అసాధ్యం

by  |
నాలుగేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ అసాధ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి కారణంగా 2024-25 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారే అవకాశం లేదని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వంశీ వకళాభరుణం అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా 2019లో ఆర్థికవ్యవస్థ పరిమాణం కంటే వచ్చే ఏడాది గణనీయంగా చిన్నదిగానే ఉంటుందని అన్నారు. కొవిడ్-19 మహమ్మారి ఆర్థిక మందగమనానికి అసలైన కారణం. అయితే, గత ఏడాది కాలంలో ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రపంచ ఆర్థికవ్యవస్థ చూసిన దానికంటే భారత ఆర్థికవ్యవస్థ క్షీణత ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం భారత జీడీపీ 3 ట్రిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉంది. ఇది నాలుగేళ్లలో 5 ట్రిలియన్లకు పెరగాలంటే సగటున ఏడాదికి 13 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదవ్వాలి. 2019లోనే ప్రధాని మోదీ 2024-25 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా, ప్రపంచ పవర్‌హౌస్‌గా మార్చాలని భావించారు. అత్యంత మెరుగైన పరిస్థితుల్లో కూడా ఈ లక్ష్యాన్ని సాధించడం అరుదు మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో ఆసియా రాజకీయార్థిక కార్యక్రమ కో-డైరెక్టర్‌గా ఉన్న వంశీ వకుళాభరణం తెలిపారు. ఆర్‌బీఐ, ఐఎంఎఫ్ ప్రస్తుత వృద్ధి అంచనాలను సవరించాయి.

2020-21లో ఆర్థికవ్యవస్థ 7.3 శాతం సంకోచించగా, ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.5 శాతం వృద్ధి అంచనాను వెల్లడించింది. ఇదే సమయంలో కరోనా పరిస్థితుల గురించి స్పందించిన ఆయన కరోనా సంక్షోభం నేపథ్యంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు కనీస జీవనోపాధి, అందుబాటులో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, ద్రవ్యోల్బణం చాలావరకు సరఫరా మందగమనం, తక్కువ సామర్థ్య వినియోగం కారణంగా ఉంది. మొత్తం డిమాండ్‌ను పెంచడం ప్రభుత్వానికి సవాలుగా మారిందని ఆయన వివరించారు. నిత్యావసర సరుకుల్లో ద్రవ్యోల్బణం నుంచి పేదలను కాపాడటం చాలా ముఖ్యమని వంశీ వకుళాభరణం వెల్లడించారు.


Next Story

Most Viewed