టార్గెట్ ఈటల.. రైతులకు ‘పల్లా’ పర్సనల్ లెటర్

by  |
టార్గెట్ ఈటల.. రైతులకు ‘పల్లా’ పర్సనల్ లెటర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ అంశాన్ని వదిలి పెట్టవద్దని భావిస్తోంది. ఇక్కడ ఈటల ప్రాభావాన్ని తగ్గించేందుకు ఊరూ వాడా కలియ తిరుగుతున్న టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మరో అస్త్రాన్ని సంధించారు. రైతులను తమవైపు తిప్పుకునేందుకు తాజాగా లేఖలు రాసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతు బంధుతో పాటు ఇతర పథకాల ద్వారా ఎలాంటి లాభం చేకూరిందో వివరిస్తూ లేఖలు పంపిస్తున్నారు. రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షునిగా, ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతులకు ఈ లేఖలు పంపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు అందులో హుజురాబాద్ నియోజకవర్గ రైతులు ఎంతమంది లాభోక్తులుగా ఉన్నారోనన్న వివరాలను రాసి మరీ వ్యక్తిగతంగా లేఖలు పంపించే ప్రక్రియ మొదలు పెట్టారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన రైతులందిరికీ ఈ లేఖలు పంపించడం ఆరంభించారు.

వ్యూహం పెద్దదే..

పర్సనల్ లెటర్స్ పంపించడం వల్ల ఎన్నో రకాలుగా పార్టీకి లాభం చేకూరుతుందన్న అభిప్రాయంతోనే సరికొత్త వ్యూహాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి వ్యక్తిగతంగా లేఖలు పంపిచండం వల్ల రైతుల్లో పార్టీపై సానుకూలతను పెంచుకోవాలన్న లక్ష్యం కనిపిస్తోంది. ఉప ఎన్నికల నాటికల్లా రైతులను టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మల్చుకుంటూ పార్టీ విజయం తథ్యమన్న భావన కనిపిస్తోంది. రైతులకు పంపించిన ఈ లేఖల గురించి పంట పొలాల వద్ద, గ్రామ కూడళ్ల వద్ద అందరూ కలిసి చర్చించుకునే అవకాశం ఉంటుందని దీనివల్ల ’మౌత్ టు మౌత్‘ పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నారు.

దీంతో హుజురాబాద్‌లో ఈటల కేంద్రీకృతంగా సాగుతున్న చర్చను టీఆర్ఎస్ వైపు మల్చుకోవాలన్నదే ’పల్లా‘ ఆశయంగా కనిపిస్తోంది. చదువు రాని రైతులు లేఖపై ఉన్న ముఖ్యమంత్రి ఫోటోను గమనించి తనకు వచ్చిన లేఖను వేరే వారితో చదివించే అవకాశం కూడా ఉంటుందని దీనివల్ల మరికొంతమందిలో పబ్లిసిటీ పెరుగుతుందన్న అంచనాలు వేసే ఈ లేఖలు రాసే సాంప్రాదాయాన్ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ లేఖల గురించి ఆ నోట ఈ నోట చర్చ జరిగి హుజురాబాద్ అంతా వ్యాపిస్తుందని దీనివల్ల గులాబీ పార్టీకి కొంతలో కొంతైనా లాభం చేకూరుతుందని అనుకుంటున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed